Share News

‘ఉపాధి’ పండుగ

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:29 AM

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అమలులో ఉన్న నరేగా నిబంధనలను మరో నెలపాటు కేంద్రం పొడిగించింది. దీంతో ఈనెలలో గరిష్ఠంగా పనులు చేసి లబ్ధిపొందాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. తదనుగుణంగా ఏప్రిల్‌ అంతా ముమ్మరంగా కూలీలకు పనిదినాలు కల్పించే విధంగా అన్ని జిల్లాల డ్వామా అఽధికారు లను ఆదేశించింది.

‘ఉపాధి’ పండుగ
యరజర్లలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌

ఏప్రిల్‌ ఆఖరు వరకు నరేగా గడువు పెంపు

ఈనెల వ్యయం అంతా కేంద్రానిదే

సద్వినియోగానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయం

ఊరూరా ముమ్మరంగా పనులకు ఆదేశం

రెండు జిల్లాల్లో రోజుకు 2.36 లక్షల పనిదినాల

లక్ష్యం నిర్దేశించుకున్న యంత్రాంగం

అన్ని పంచాయతీల్లో నేడు పనులు ప్రారంభం

చిర్రికూరపాడులో పాల్గొననున్న మంత్రి స్వామి

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అమలులో ఉన్న నరేగా నిబంధనలను మరో నెలపాటు కేంద్రం పొడిగించింది. దీంతో ఈనెలలో గరిష్ఠంగా పనులు చేసి లబ్ధిపొందాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. తదనుగుణంగా ఏప్రిల్‌ అంతా ముమ్మరంగా కూలీలకు పనిదినాలు కల్పించే విధంగా అన్ని జిల్లాల డ్వామా అఽధికారు లను ఆదేశించింది. అందుకోసం ఏప్రిల్‌ 1న ఉపాధి పనుల పండుగ అనే కార్యక్రమాన్ని రూపొందిం చింది. ఆ ప్రకారం బుధవారం అన్ని గ్రామ పంచా యతీల్లో 2026-27 సంవత్సర పనులు చేపట్టాల ని సూచించింది. పండుగలాగా ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ఏప్రిల్‌లో పనిదినాల కల్పనపై డ్వామా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు.

ఒంగోలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం పనుల పూర్తికి కేంద్రం మరో నెల గడువు ఇచ్చింది. దీంతో భారీగా చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అవకాశంగా కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించాలని యంత్రాంగానికి సూచించింది. బుధవారం అన్ని పంచాయతీల్లో ఉపాధి పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో రెండు జిల్లాల్లోనూ అన్నిచోట్ల పనులు మొదలుపెట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పూర్వపు ప్రకాశం జిల్లాకు ఏప్రిల్‌లో 37.50 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం నిర్దేశించగా ప్రస్తుతం ప్రకాశంలో కలిసిన రెండు నియోజకవర్గాలలో మరో పది లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. వెరసి రెండు జిల్లాలు కలిపి ఏప్రిల్‌ నెలలో 47.50 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా రోజుకు సగటున లక్షా 80వేల పని దినాలు చేయాలి. ఈ లక్ష్యసాధనకు రెండు జిల్లాలకు డ్వామా పీడీగా వ్యవహరిస్తున్న జోసఫ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది రెండు రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. రెండు జిల్లాల్లోని మొత్తం పది నియోజకవర్గాల్లో 49 మండలాలు ఉండగా గ్రామాల వారీ పనుల కల్పనకు సంబంధించి గత అనుభవాలతో ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రకారం రోజువారీ ప్రస్తుత మార్కాపురం జిల్లాలో లక్షా 36వేలు, ప్రకాశంలో లక్ష పనిదినాల కల్పన లక్ష్యాన్ని డ్వామా అధికారులు నిర్దేశించుకున్నారు.

పనులకు కార్యాచరణ రూపకల్పన

సాధారణంగా ఎక్కువ మంది కూలీలు పశ్చిమప్రాంతంలో పనులకు వస్తారు. తూర్పు, దక్షిణ ప్రాంతంలోని కొన్ని మండలాల్లోనూ అలాగే ఉంటుంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్థానికంగా లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. అందులో 75శాతం నుంచి 80శాతం పూర్తిచేసినా ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్‌లో ఉపాధి పనులకు సంబంధించి కేంద్రం నరేగా నిబంధనలు పొడిగించడంతోపాటు మొత్తం వ్యయాన్ని తానే భరిస్తుంది. ఆ తర్వాత అమలులోకి వచ్చే నూతన చట్టం వీజీబీరాంజీ నిబంధనలు అయితే ప్రతి వంద రూపాయల వ్యయంలో 40 శాతాన్ని రాష్ట్రం భరించాలి. ఈ విషయాన్ని మండలస్థాయి అధికారులతో రెండు రోజులు క్రితమే వీడియో కాన్ఫరెన్స్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నిర్వహించి స్పష్టంగా చెప్పారు. దానిని పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌లో భారీగా పనులు కల్పించాలని ఆదేశించడంతో తదనుగుణంగా రెండు జిల్లాల్లో పనులపై స్థానిక అధికారులు కార్యాచరణ రూపొందించారు.

అధికారులు, నేతలు హాజరు

అన్ని పంచాయతీల్లో బుధవారం ఉపాధి హామీ పథకం పనుల పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా జిల్లాలోనూ అన్నిచోట్లా పనులు మొదలుపెట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా పలుచోట్ల ముఖ్యప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. అదేరోజున పేదల సేవలో పేరుతో పెన్షన్‌ల పంపిణీని రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమానికి ఇంచుమించు అన్నిచోట్లా కీలక నేతలు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ఆ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉపాధి పనుల ప్రారంభ కార్యక్రమంలో కూడా వారు పాల్గొంటారని సమాచారం. అందులోభాగంగా జరుగుమల్లి మండలం చిరికూరపాడు గ్రామంలో మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్‌ రాజాబాబు పాల్గొంటారని సమాచారం.

Updated Date - Apr 01 , 2026 | 01:29 AM