అకాల వర్షం.. అపార నష్టం
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:57 AM
మార్కాపురం జిల్లాలో అకాల వర్షం ఉద్యాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి వెన్నువిరిచింది. గాలివా నకు అరటి చెట్లు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే అరటి తోటలకు రూ. కోటికిపైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అరటి రైతుకు కోలుకోలేని దెబ్బ
ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే రూ.కోటికిపైన నష్టం
కొన్నిచోట్ల దెబ్బతిన్న బొప్పాయి తోటలు
నేలరాలిన మామిడి కాయలు
గిద్దలూరు/దోర్నాల/కంభం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) మార్కాపురం జిల్లాలో అకాల వర్షం ఉద్యాన రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి వెన్నువిరిచింది. గాలివా నకు అరటి చెట్లు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే అరటి తోటలకు రూ. కోటికిపైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురంలో 30 హెక్టార్లలో బొప్పాయి తోటలు ధ్వంసమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.: జిల్లాలో మంగళవారం సాయంత్రం సుమారు రెండు గంటలపాటు కొనసాగిన గాలివాన బీభత్సం ఉద్యాన పంటలకు అపార నష్టం కలిగించింది. అరటి రైతులను నిండా ముంచింది. ధరలు పెరుగుతున్న సమయంలో తోటలు దెబ్బతినడంతో సాగుదారులు లబోదిబోమంటున్నారు. ఉద్యానశాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం గిద్దలూరు నియోజకవర్గంలో 100 ఎకరాలకు పైగా అరటి తోటలు నేలకొరిగాయి. సుమారు రూ.కోటికిపైన నష్టం వాటిల్లింది. ఒక్క బురుజుపల్లి గ్రామంలోనే 25 మంది రైతులకు చెందిన 60 ఎకరాలలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు తన నాలుగు ఎకరాల్లోని తోట పూర్తిగా నేలకొరిగిందని, రూ.3లక్షల మేర పెట్టుబడిని కోల్పోయానని గ్రామానికి చెందిన తంగెళ్ల నారాయణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టానని, వాటిని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాచర్ల మండలంలోని గుడిమెట్ట, చినగానిపల్లి గ్రామాల పరిధిలో 13 మంది రైతులకు చెందిన 16 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కంభం మండలంలో 10 మంది రైతులకు చెందిన 20 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 48 మంది రైతులకు చెందిన 100 ఎకరాల్లో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఉద్యాన అధికారి శ్వేత తెలిపారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. నష్టం అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈదురు గాలులకు గిద్దలూరు మండలంలో మామిడి రైతులు కొంతమేర నష్టపోయారు. గాలులకు కాయలు నేలరాలాయని, అవి దెబ్బతిని అమ్ముకోవడం కష్టమైందని రైతులు వాపోతున్నారు.