Share News

నిలకడలేని మార్కెట్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:48 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో నిలకడ కనిపించడం లేదు. ఒక్కో రోజు ఒక్కో రకంగా సాగుతోంది. క్రమంగా వేలానికి రోజువారీ వచ్చే బేళ్ల సంఖ్య పెరుగుతుండగా నోబిడ్‌లు, సగటు ధరలు నిలకడగా ఉండటం లేదు, వరుసగా రెండు, మూడు రోజులు కూడా ఒకేరకంగా మార్కెట్‌ సాగడం లేదు.

నిలకడలేని మార్కెట్‌

నాల్గోవంతు పొగాకు బేళ్లు నోబిడ్‌

కనిగిరిలో అత్యధికంగా 55.37శాతం

మరికొన్ని చోట్ల 30నుంచి 36శాతం

ధరల్లోనూ హెచ్చుతగ్గులు

ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో నిలకడ కనిపించడం లేదు. ఒక్కో రోజు ఒక్కో రకంగా సాగుతోంది. క్రమంగా వేలానికి రోజువారీ వచ్చే బేళ్ల సంఖ్య పెరుగుతుండగా నోబిడ్‌లు, సగటు ధరలు నిలకడగా ఉండటం లేదు, వరుసగా రెండు, మూడు రోజులు కూడా ఒకేరకంగా మార్కెట్‌ సాగడం లేదు. శుక్ర, శనివారాల్లో కొనుగోళ్ల తీరును చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. శుక్రవారం మార్కెట్లో నోబిడ్‌లు గతం కన్నా తగ్గాయి. ఇవి సగటున 18.40శాతం ఉండగా, కిలోకు సగటున రూ.195.20 ధర లభించింది. అయితే శనివారం మార్కెట్లో నోబిడ్‌లు ఏకంగా ఏడు శాతం పెరిగాయి. సగటున 25.38శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలకు 7,612 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 5,214 బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేశారు. మరో 2,398 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అందులో 1,932 బేళ్లు అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. అంటే వేలానికి వచ్చిన బేళ్లలో 25.38 శాతం నోబిడ్‌ చేశారు. కొన్నిచోట్ల నోబిడ్‌లు ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. కనిగిరి వేలం కేంద్రంలో ఏకంగా 55.37 శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. అవి వెల్లంపల్లిలో 36.50శాతం, ఒంగోలు-2 కేంద్రంలో 32.26శాతం, కందుకూరు-2లో 31.68శాతం, కలిగిరిలో 31.11 శాతంగా ఉన్నాయి. అదేసమయంలో 671 బేళ్లు అమ్మకానికి వచ్చిన కందుకూరు-1 కేంద్రంలో కేవలం 7శాతం మాత్రమే నోబిడ్‌ కావడం గమనార్హం. అలాగే 528 బేళ్లు వచ్చిన డీసీపల్లిలో 9.43శాతం, 943 బేళ్లు తెచ్చిన కొండపిలో 10.60శాతం మాత్రమే నోబిడ్‌ కావడం మార్కెట్లో నిలకడలేని పరిస్థితికి నిదర్శనం.

Updated Date - Jul 19 , 2026 | 02:48 AM