Share News

కుదుటపడని మార్కెట్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:18 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వారం గడుస్తున్నా పొగాకు వ్యాపారుల్లో స్పందన లేదు. బోర్డు యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తున్నప్పటికీ దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడ లేదు. గతంతో పోల్చితే అన్ని కేంద్రాల్లో వేలం సాఫీగా సాగడంతోపాటు నోబిడ్‌లు తగ్గినప్పటికీ రైతులు ఆశించిన లేదా సీఎం ఆదేశించిన విధంగా ధరలు పెరగలేదు.

కుదుటపడని మార్కెట్‌
ఒంగోలులో సంయుక్త కిసాన్‌ మోర్చా రిలే దీక్షల్లో పాల్గొని మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

సీఎం చెప్పి వారమైనా గాడినపడని వైనం

పరిమితంగానే పొగాకు కొనుగోళ్లు

నోబిడ్‌లు తగ్గినా మెరుగుపడని ధరలు

కలెక్టరేట్‌ వద్ద ఎస్‌కేఎం రిలే దీక్షలు

27న డీసీపల్లి పరిధిలో ట్రాక్టర్ల ర్యాలీ

నేడు బోర్డు పాలకమండలి సమావేశం

వచ్చే ఏడాది సాగు, ప్రస్తుత మార్కెట్‌పై చర్చ

ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ

18.79 మిలియన్‌ కిలోల కొనుగోలు

కిలోకు రూ. 216.36 లభించిన సగటు ధర

ఒంగోలు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వారం గడుస్తున్నా పొగాకు వ్యాపారుల్లో స్పందన లేదు. బోర్డు యంత్రాంగం విస్తృత కసరత్తు చేస్తున్నప్పటికీ దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడ లేదు. గతంతో పోల్చితే అన్ని కేంద్రాల్లో వేలం సాఫీగా సాగడంతోపాటు నోబిడ్‌లు తగ్గినప్పటికీ రైతులు ఆశించిన లేదా సీఎం ఆదేశించిన విధంగా ధరలు పెరగలేదు. రోజువారీ కొనుగోళ్లు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. అదేసమయంలో గిట్టుబాటు ధరల కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా చేపట్టిన ఆందోళనలు రెండో దశకు చేరాయి. దక్షిణాదిలో వేలం ప్రక్రియ ప్రారంభమై సుమారు మూడు మాసా లు కావస్తోంది. అందులో అన్ని కేంద్రాలు ప్రారంభమై రెండున్నర నెలలు అవుతోంది. అయినా ఇంకా అధికారికంగా అనుమతించిన పంటలో 20శాతం మాత్రమే కొనుగోలు జరగ్గా పండిన పంటలో అది కేవలం 12శాతం మాత్రమే. సగటు ధరలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌కు దక్షిణాదిలో 88.88 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా సుమారు 148 మిలియన్‌ కిలోల ఉత్పత్తి జరిగినట్లు అంచనా. గతం కన్నా నెల ఆలస్యంగా మార్చి 25 తొలివిడత, ఏప్రిల్‌ 9న రెండో దశ కొనుగోళ్లను ప్రారంభించారు. అత్యధిక రోజులు మార్కెట్‌ ఒడిదొడుకులతోనే సాగింది. కొనుగోళ్లు మంద కొడిగా నడుస్తున్నాయి. సజావుగా వేలం ప్రక్రియ సాగితే ఈ సమయానికి 50 మిలియన్‌ కిలోల వరకు కొనుగోళ్లు పూర్తయ్యేవి. కానీ కేవలం 18.79 మిలియన్‌ కిలోలు మాత్రమే జరిగాయి. సగటున కిలోకు రూ.216.36 ధర లభించింది. అలా కొనుగోళ్లలో తీవ్రమందకొడితోపాటు సగటు ధరలు కూడా తగ్గాయి. గరిష్ఠ ధర కిలో రూ.250 లెక్కకు చూపుతున్నా అది కొద్ది బేళ్లకే పరిమితమవుతోంది. అత్యధిక శాతం బేళ్లను వ్యాపారులు కిలో రూ.200లోపు కొనుగోలు చేస్తున్నారు. కనిష్ఠ ధర రూ.160గా ఉంది. నోబిడ్‌ భారీగా ఉంటూ రైతులలో తీవ్ర అలజడితో ఎస్‌కేఎం ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభమయ్యాక పరిస్థితి తీవ్రతను గుర్తించి స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. ఈనెల 18న కీలక సమీక్ష చేసి నోబిడ్‌లు ఉండరాదని, అలాగే కిలో రూ.200కు తక్కువ లేకుండా ధరలు ఇవ్వాలని ఆదేశించారు. తదనుగుణంగా బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో వారం క్రితం వరకు రోజూ సగం కేంద్రాల్లో వేలం నిలిచిపోవడం, 40శాతానికిపైగా నోబిడ్‌లు ఉంటున్న పరిస్థితి నుంచి మార్కెట్‌ కొంతమేర మెరుగుపడింది. దక్షిణాదిలో అన్ని కేంద్రాల్లోనూ మంగళ, బుధవారాల్లో వేలం కొనసాగడమేకాక నోబిడ్‌ బేళ్లు 20శాతం లోపునకు తగ్గాయి. కానీ సీఎం ఆదేశాలకు అనుగుణంగా లేదా రైతులు ఆశిస్తున్న విధంగా ధరలు మాత్రం మెరుగవలేదు. సగటు ధర కిలోకు రూ.250 ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వరంగ సంస్థలతో కొనుగోలు చేయించాలని, గరిష్ఠ ధర కిలో రూ.360 ఉండాలన్న డిమాండ్లతో నెలరోజులకుపైగా పోరుబాట పట్టిన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు ఆందోళనలు మరింత పెంచారు.

ఆందోళనలు ఉధృతం

ఈనెల 19న ఒంగోలులో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం ద్వారా రైతుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదన స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో ఆందోళనను ఉధృతం చేయాలని ఎస్‌కేఎం నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. ఈనెల 27 వరకు ఇవి కొనసాగుతాయి. అలాగే ఒంగోలు తరహాలో నెల్లూరు జిల్లా డీసీపల్లి వేలం కేంద్రం పరిధిలో ఈనెల 27న ట్రాక్టర్ల ర్యాలీకి ఎస్‌కేఎం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కేంద్రం పరిధిలోని మర్రిపాడు నుంచి డీసీపల్లి మీదుగా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో పొగాకు బోర్డు పాలకమండలి పూర్తిస్థాయి సమావేశం జరగనుంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిపై చర్చించడంతోపాటు వచ్చే సీజన్‌కు రాష్ట్రంలో పంట సాగు పరిమితి, పరిమాణంపై నిర్ణయం చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌ తవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాది పంట ఉత్పత్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్డు పాలక మండలిలో రాష్ట్రానికి చెందిన రైతుప్రతినిధులు ఎవ్వరూ లేకుండా ఈ సమావేశం జరగనుంది.

Updated Date - Jun 25 , 2026 | 03:18 AM