Share News

అందని పరిహారం

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:04 AM

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. అధికారుల లెక్కల ప్రకారం రూ.25 కోట్లకుపైన పెండింగ్‌ ఉంది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.6.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.

అందని పరిహారం
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను

నిధులిచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల్లో ఆందోళన

దర్శి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. అధికారుల లెక్కల ప్రకారం రూ.25 కోట్లకుపైన పెండింగ్‌ ఉంది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.6.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబరులో ప్రభుత్వం ఈనిధులను విడుదల చేసింది. పరిహారం అందించాల్సిన రైతుల వివరాలను కూడా రైల్వే శాఖ అధికారులు పంపారు. ఇక పంపిణీ పూర్తవుతుందని భావించిన తరుణంలో ఈఏడాది మార్చిలో ప్రభుత్వం ఆ నిధులను వెనక్కు మళ్లించింది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఏళ్ల తరబడి పరిహారం చెల్లించకుండా కాలయాపన చేయడం పట్ల బాధిత రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైల్వేలైన్‌ నిర్మాణ పనుల సమయంలో అధికారులను రైతులు గట్టిగా అడుగుతుండటంతో ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఇప్పటికే నడికుడి నుంచి కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయింది. కనిగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు పనులు జరుగుతున్నాయి. త్వరలో గుంటూరు నుంచి కనిగిరి వరకు రైలు నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుడైనా తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 03:04 AM