పొదుపు మహిళలకు ఉన్నతి
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:28 AM
ఉమ్మడి జిల్లాలోని పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ఉన్నతి పథకం కింద సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 280 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.
ఉమ్మడి జిల్లాలో 280 మంది ఎస్సీలకు రుణాలు
సగం సబ్సిడీతో మంజూరు
కార్పొరేషన్ నుంచి చెల్లింపు
వెలుగు అధికారులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత
ఒంగోలు నగరం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ఉన్నతి పథకం కింద సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 280 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అందులో సగం అంటే రూ.50వేలు సబ్సిడీపోను లబ్ధిదారు రూ.50వేలను మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ సొమ్మును ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదల చేయనున్నారు.
ఈ నెలాఖరులోపు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని గతంలో డీఆర్‌డీఏ, వెలుగు ద్వారా అమలు చేసింది. గతేడాది నుంచి ఎస్సీ కార్పొరేషన్‌తో కలిపింది. సబ్సిడీ మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తూ మిగిలిన రుణంలో సగాన్ని వెలుగు అధికారులు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నారు. పొదుపు మహిళలకు రుణాల మంజూరుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తుండటంతో ఉన్నతి పథకం అమలు ప్రభుత్వానికి సులభతరంగా మారింది. లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి ఈనెలాఖరులోపు రుణాలు అందజేయాలని ఆదేశించింది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీని ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వెలుగు అధికారులు చేపట్టారు.