Share News

నిరాటంకంగా..

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:09 AM

ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా చేస్తున్న టీబీఎం తొలగింపు పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. టన్నెల్‌-2లో చిక్కుకుని ప్రాజెక్ట్‌ పనుల పురోగతికి ఆటంకంగా మారిన టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌) తొలగింపు పనులను 40 రోజుల క్రితం అధికారులు ప్రారంభించారు.

నిరాటంకంగా..
ముక్కలు చేసిన టీబీఎం భాగాలను లారీలో నింపుతున్న ఎక్స్‌కవేటర్‌

టీబీఎం తొలగింపు పనులు వేగవంతం

వెలిగొండ టన్నెల్లో నుంచి వెలుపలికి వ్యర్థాలు

మార్కాపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా చేస్తున్న టీబీఎం తొలగింపు పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. టన్నెల్‌-2లో చిక్కుకుని ప్రాజెక్ట్‌ పనుల పురోగతికి ఆటంకంగా మారిన టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌) తొలగింపు పనులను 40 రోజుల క్రితం అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి వేగంగా కొనసాగిస్తున్నారు. టీబీఎంను టన్నెల్‌ లోపలే నిర్వీర్యం చేసి విడిభాగాలను ట్రక్కుల ద్వారా వెలుపలికి తెస్తున్నారు. పనిలో ఉపయోగిస్తున్న హైడ్రా ఒకట్రెండు సార్లు మొరాయించినా తక్షణమేదానికి మరమ్మతులు చేసి పనులు నిలిచిపోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో టన్నెల్‌ తవ్వకం కోసం తెచ్చిన భారీ టీబీఎం భౌగోళిక సమస్యలు, ఇతర అడ్డంకుల వల్ల టన్నెల్‌లోపలే నిలిచిపోయిన విషయం విదితమే. 2022 నుంచి పనులకు అడ్డంకిగా ఉన్న టీబీఎంను తొలగించాలని ప్రభుత్వం భావించింది. కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో క్లియర్‌ కోసం హైకోర్టును అనుమతి కోరింది. దీనిపై మే 4వ తేదీన హైకోర్టు తీర్పునిస్తూ టీబీఎం తొలగింపు చేసుకోవచ్చని, కాంట్రాక్టర్‌ సమస్యను నాలుగు నెలల్లో పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వెంటనే అధికారులు టీబీఎం తొలగింపు పనులను ప్రారంభించారు. టన్నెల్‌ లోపల 11.85 కి.మీ వద్ద ఉన్న యంత్రాన్ని అక్కడే ముక్కలు చేసి వ్యర్థాలను టిప్పర్‌ల ద్వారా బయటకు తెస్తున్నారు. ఇందుకోసం పశ్చిమబెంగాల్‌ నుంచి 25 మంది వచ్చి పనిచేస్తున్నారు. ముక్కలుగా చేసిన యంత్ర పరికరాలను టిప్పర్‌ల ద్వారా దాదాపు 12 కి.మీ ప్రయాణించి దోర్నాల మండలం కొత్తూరు వైపు బయటకు తెస్తున్నారు. ఇక బోరింగ్‌ మిషన్‌ ముందుభాగం (హెడ్‌ లేదా కట్టర్‌) టన్నెల్‌ లోపలే గొయ్యితీసి పూడ్చాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 130.18 మీటర్ల పొడవున్న యంత్రాన్ని ఇప్పటికి సుమారు 90 మీటర్లు కట్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో నుంచి తీసిన విడిభాగాల్లో ఇప్పటివరకు 400 టన్నులకు పైగా బయటకు కూడా తరలించారు. మరో నెల రోజుల్లో టీబీఎంను పూర్తిగా తొలగించే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Jul 12 , 2026 | 02:09 AM