రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:48 PM
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వేటపాలెం రావూరి రోడ్డు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
వేటపాలెం(చీరాల), అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వేటపాలెం రావూరి రోడ్డు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు నిండు చేతుల చొక్కా, బులుగు రంగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
పర్చూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో వ్యక్తి మృతి
పర్చూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి) : పర్చూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి కుప్పకూలి మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. తెలిసిన వివరాల మేరకు... చీరాల బాలజీనగర్‌కు చెందిన రావిలింగం రాధాకృష్ణారెడ్డి(65) వివాహ ధ్రువీకరణ పత్రం కోసం మరో మహిళతో కలిసి పర్చూరు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి ఆటోలో వచ్చారు. రిజిస్ర్టేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని తిరుగు ప్రయాణమవుతుండగా కార్యాలయ ప్రాంగణంలోనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై పి.అంకమ్మరావు హుటాహుటిన సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునితో పాటు వచ్చిన మహిళ నుంచి వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు రాధాకృష్ణారెడ్డి(65) మాజీ ఆర్మీ ఉద్యోగి అని తెలిసింది. ఐదేళ్ల క్రితం భార్య చనిపోవటంతో మరో మహిళతో కలసి ఉంటున్నట్లు సమాచారం. అదే మహిళతో కలసి వివాహ ధ్రువీకరణ పత్రానికి వచ్చి ఇలా మృతి చెందాడు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె చెన్నైలో ఉండగా, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు.
గుండెపోటుతో ఆర్‌ఎంపీ మృతి
పేరాల(చీరాల), అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రాణాంతక వ్యాధులకు సైతం మెరుగైన వైద్యం అందించిన ఆర్‌ఎంపీ మార్తాండం వెంకటరమణారావు(68) కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఇబ్బంది పడ్డ ఆయన కానరాని లోకాలకు చేరాడు. పలువురు వెంకట రమణారావు మృతదేహానికి నివాళులు అర్పించారు.
పోలీసు లాంచనాలతో ఎస్‌ఐ అంత్యక్రియలు
చినగంజాం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి) : మండలంలోని కడవకుదురు గ్రామానికి మర్రి సుబ్బారావు(53) గంటూరులోని పట్టాభిపురం ఎస్‌ఐగా పనిచేస్తూ ఈ నెల 10వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. సుబ్బారావు ఆర్మీలో రిటైర్డ్ అయిన తరువాత పోలీసుశాఖలో చేరాడు. గ్రామంలోని సుబ్బారావు స్వగృహం వద్ద మంగళవారం ఆయన మృతదేహాన్ని చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, ఇంకొల్లు సీఐ ఎం రామానాయక్, చినగంజాం ఎస్‌ఐ సురేష్, పట్టాభిపురం సీఐలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంటూరు ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.