Share News

ఖరీఫ్‌కు ప్రతికూలమే!

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:35 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై తొలివారం ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి.

ఖరీఫ్‌కు ప్రతికూలమే!

ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతం

జూలై తొలివారం గడిచినా కనిపించని పైర్లు

ఎల్‌నినో ప్రభావం .. తగ్గని వేసవి తీవ్రత

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలై తొలివారం ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి జల్లులు తప్ప భూములు పదునయ్యే స్థాయిలో వర్షం కురవడం లేదు. పైగా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకూ కేవలం మూడు శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎల్‌నినో ప్రభావం ఉమ్మడి జిల్లాపై స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రత్యామ్నాయంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది.

ఒంగోలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌కు ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. సీజన్‌ ఆరంభమై నలభై రోజులు గడుస్తున్నా పొలాల్లో పైర్లు కనిపించడం లేదు. కనీసం సాగుకు అవసరమైన పనుల్లో రైతులు నిమగ్నమైన పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఇటు ప్రకాశం, అటు మార్కాపురంలో లోటు వర్షపాతం నెలకొంది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండి వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ నాలుగు మాసాల క్రితమే హెచ్చరించింది. ఈ ప్రభావం మన రాష్ట్రంతోపాటు జిల్లాపై కూడా ఉండనుంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉండే జిల్లాల వివరాలను మే ఆఖరులో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించింది. తదనుగుణంగా చర్యలకు సూచించింది. ఆ జాబితాల్లో జిల్లా కూడా ఉంది. జూలై రెండో పక్షానికి కూడా ఆశించిన రీతిలో వర్షాలు కురవక పంటల సాగు ముందుకు సాగకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఎలా అన్నదానిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది.

ఆ కొద్ది కూడా సాగు లేదు

ఉమ్మడి జిల్లా విభజన అనంతరం ప్రస్తుత ప్రకాశం జిల్లా పరిఽధిలో ఖరీఫ్‌ పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానమైన పొగాకు, వరి, శనగ, మినుము, మొక్కజొన్న, మిర్చి, ఇతరత్రా పంటలు రబీ సీజన్‌లోనే జిల్లాలో ఎక్కువగా వేస్తారు. అలా ఖరీఫ్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 55,774 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. అందులో అధికంగా 25,440 హెక్టార్లు అంటే ఇంచుమించు సగం విస్తీర్ణంలో కంది, మరో 10,142 హెక్టార్లలో వరి, 7వేల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌ ఆరంభమయ్యే జూన్‌ లో తొలకరి పైర్లుగా సజ్జ, పెసర, నువ్వు వంటివి వేస్తారు. జిల్లా విభజన, మారిన వాతావరణ పరిస్థితులతో తొలికరి సాగు ప్రస్తుత జిల్లా పరిధిలో అతి తక్కువ విస్తీర్ణానికి పరిమితం కాగా ఈ ఏడాది ఆ కొద్ది విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌ సమయం జూన్‌ నుంచి సెప్టెంబరు ఆఖరు వరకు కాగా తొలకరి జల్లులు సకాలంలో పడితే మే ఆఖరు నుంచే పశుగ్రాస పంటలు, తొలకరి పైర్లను రైతులు వేస్తారు. జూన్‌ ఆరంభం నుంచి కీలక ఖరీఫ్‌ మెట్ట పంటలైన కంది, పత్తితోపాటు ఇతరత్రా సాగు చేస్తారు. అలా జూన్‌ ఆఖరు నుంచి ఆగస్టు ఆఖరు వరకు ముమ్మరంగా ఖరీఫ్‌ మెట్ట పైర్లు, సెప్టెంబరులో వరితోపాటు ఇతరత్రా నీటి ఆధారిత పంటలు సాగు వేస్తారు. అలా ఈ సమయానికి గ్రామాల్లో పశుగ్రాసం, తొలకరి పైర్లతో పొలాలు పచ్చగా ఉంటాయి. కంది, పత్తి విత్తనాలు వేస్తుండటం, ఇతర పంటలకు భూములను సిద్ధం చేసే పనుల్లో రైతులు బిజీబిజీగా కనిపిస్తారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 366.0 మి.మీ సాధారణ వర్షపాతం కాగా జూన్‌, జూలై మాసాల్లో 144 మి.మీ నమోదు కావాలి. అందులో ఈ సమయానికి సుమారు 70 మి.మీ కురవాల్సి ఉండగా 52మి.మీ మాత్రమే పడింది. అలా 25శాతం లోటు వర్షపాతం ఇప్పటికే ఉంది. రానున్న రోజులు కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందన్న సంకేతాలు ఉండటం ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇప్పటివరకు 3శాతమే..

జిల్లాలో ఇప్పటివరకు 52 మి.మీ వర్షపాతం నమోదైనా అది కొద్ది ప్రాంతాలకే పరిమితమైంది. అప్పుడప్పుడూ కొద్దిపాటి జల్లులు పడుతూ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం తప్ప సాగుకు ఉపకరించే వర్షం కురవలేదు. ఈ పరిస్థితి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 40 రోజులు గడిచింది. ఇప్పటి వరకూ సాధారణ విస్తీర్ణంలో కేవలం 1,672 హెక్టార్లు (3శాతం) విస్తీర్ణంలో మాత్రమే పంటల సాగయ్యాయి. వాటిలోనూ కీలకమైన కంది, పత్తి విత్తనం ఎక్కడాపడిన దాఖలాలు లేవు. తొలకరి పైర్లుగా పిలిచే సజ్జ, నువ్వు, పెసర పంటలదీ అదే పరిస్థితి, బోర్లు, స్ర్పింకర్లు కింద సుమారు 1,200 హెక్టార్లలో వరి, వేరుశనగ పంట వేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తీవ్ర ప్రతికూలమే కనిపిస్తోంది.

మార్కాపురం జిల్లాలో కనిపించని పంటల జాడ

ఖరీఫ్‌ ప్రారంభమై నలభై రోజులు గడిచినా మార్కాపురం జిల్లాలో పంటల జాడ కనిపించడం లేదు. జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 44 మి.మీ కాగా 40 మి.మీ కురిసింది. ఎక్కువ రోజులపాటు జల్లుల రూపంలో పడింది. పొలాలు పదునయ్యేలా కురవలేదు. దీంతో ఒక్కపంట కూడా సాగు కాలేదు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 86,349 హెక్టార్లు కాగా అందులో కంది అధికంగా 43,890 హెక్టార్లలో సాగు చేస్తారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క ఎకరంలో కూడా కంది విత్తనం పడలేదు. వేసవి పత్తి కేవలం 4వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. మిగిలిన ఏ పంట కూడా జిల్లాలో సాగు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. మొత్తంమీద సరైన వర్షం లేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రైతులు ఆలోచనలో పడటంతో ఖరీఫ్‌ సాగు జిల్లాలో పూర్తిగా పడకేసింది.

Updated Date - Jul 07 , 2026 | 02:35 AM