Share News

పొగాకు మార్కెట్‌లో అనిశ్చితి

ABN , Publish Date - May 03 , 2026 | 02:23 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. రైతులు ఆశించిన విధంగా ధరలు పెరగకపోగా కొనుగోళ్లు మందగిస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా కనిపించింది. ప్రస్తుతం మార్కెట్‌ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయి.

పొగాకు మార్కెట్‌లో అనిశ్చితి

కొన్న బేళ్ల కన్నా అధికంగా తిరస్కరణలు

ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 53.67శాతం వెనక్కు

శాంపిల్స్‌ కోసమంటూ లోగ్రేడ్‌ కొనుగోళ్ల వరకే పరిమితమవుతున్న బయ్యర్లు

కొన్నిచోట్ల వాటి కన్నా మేలురకానికి తక్కువ ధర

అధిక తిరస్కరణలకు అదే ప్రధాన కారణం

చక్కదిద్దలేని స్థితిలో పొగాకు బోర్డు

రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. రైతులు ఆశించిన విధంగా ధరలు పెరగకపోగా కొనుగోళ్లు మందగిస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా కనిపించింది. ప్రస్తుతం మార్కెట్‌ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయి. వారం నుంచి పలు వేలం కేంద్రాల్లో అమ్మకాలకు వచ్చిన బేళ్లలో కొనుగోలు చేసిన వాటి కన్నా తిరస్కరించినవే అధికంగా ఉన్నాయి. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కెట్‌ పరిస్థితిని సమీక్షించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు అన్నివేలం కేంద్రాల రైతు కమిటీల ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

ఒంగోలు, మే 2 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా నడుస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాదిలోని రెండు రీజియన్ల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాల్లో 88.88 మిలి యన్‌ కిలోల పంట ఉత్పత్తికి (2025-26 సీజన్‌) పొగాకు బోర్డు అను మతి ఇచ్చింది. దాదాపు 148 మిలియన్‌ కిలోల ఉత్పత్తి వచ్చినట్లు అంచనా వేస్తూ మార్చి 25న వేలం ప్రక్రియను బోర్డు అధికారులు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 2.50 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. సగటున కిలోకు రూ.241 ధర లభిం చింది. అంటే పండిన పంటలో ఇంతవరకు రెండు శాతం కూడా కొనుగోళ్లు జరగలేదు. గతేడాది వేలం ప్రారంభమైన రోజు కిలోకు రూ.280 ఽఇచ్చిన వ్యాపారులు ఈ ఏడాది కిలో రూ.250కు పరిమితం చేశారు. ప్రారంభ ధరలపై అసంతృప్తి ఉన్నప్పటికీ కొద్దిరోజుల తర్వాత అయినా పెరుగుతుందని రైతులు భావించారు. అయితే ఆ పరిస్థితి లేకపోగా కొనుగోళ్లు మందగించాయి. తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

కొండపిలో 55శాతం వెనక్కు.. ఇతర కేంద్రాల్లో మూడోవంతు

నాలుగైదు రోజుల క్రితం 20 నుంచి 25శాతం, అడపాదడపా ఒకట్రెండు రోజులు 30శాతంపైగా ఉన్న తిరస్కరణ బేళ్లు ప్రస్తుతం సగానికి మించిపోయాయి. కొండపి వేలం కేంద్రంలో శనివారం ఏకంగా 55శాతం వెనక్కు వెళ్లాయి. అక్కడ 525 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 249 కొనుగోలు చేశారు. 290 తిరస్కరించారు. ఆ ప్రకారం వేలానికి వచ్చిన బేళ్లలో కొన్న వాటి కన్నా తిరస్కరించినవే అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితే పలు కేంద్రాల్లో కనిపించింది. మూడోవంతుకు పైగా తిరస్కరణలు జరిగాయి. గరిష్ఠ ధర కిలోకు రూ.250 ఉన్నప్పటికీ లెక్కకు కొద్ది బేళ్లకు మాత్రమే ఇస్తూ ఎక్కువ బేళ్లను రూ.220 మించి కొనడం లేదు.

మేలు రకాన్ని పట్టించుకోవడం లేదు

కంపెనీల ప్రతినిధులు విదేశీ ఆర్డర్ల కోసం ఆయా దేశాల వ్యాపా రులకు శాంపిల్స్‌ చూపించేందుకు అవసరమైన గ్రేడ్లు తప్ప మేలు రకం బేళ్లను సైతం కొనుగోలు చేయడం లేదు. శాంపిల్స్‌కు అవసర మైన లోగ్రేడ్‌లలో నాణ్యమైనవిగా భావించే వాటితోపాటు పచ్చరకం గ్రేడ్లను కొంటూ మేలురకాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాక తమకు శాంపిల్స్‌కు అవసరమైన గ్రేడ్‌లలో నాణ్యత బాగున్న వాటిని కిలో రూ.240 వరకూ పోటీపడి కొంటున్నారు. మేలురకం బేళ్లలో అత్యధిక శాతానికి కిలో రూ.200 నుంచి రూ.220లోపుగానే ధర వేస్తున్నారు. దీంతో ఆ బేళ్లు నోబిడ్‌లు అవుతూ తిరస్కరణలు అధికమవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ చక్కదిద్దే ప్రయత్నం పొగాకు బోర్డు వైపు నుంచి అవసరమైన స్థాయిలో లేదన్న విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. కొందరు బోర్డు అధికారులు తాము చేయగలిగింది ఏమీ లేదని ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతు నేతలతో వాఖ్యానిస్తున్నారు. మొత్తంగా మార్కెట్‌ సంక్షోభం వైపు పయనిస్తుండటంపై పొగాకు రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో పొగాకు వేలంకేంద్రాల రైతు ప్రతినిధులు ఈ విషయంపై దృష్టిపెట్టారు.

అన్ని కేంద్రాల్లో సాగిన వేలం

దక్షిణాదిలోని మూడు జిల్లాల్లో 11 వేలం కేంద్రాలు ఉండగా మార్చి 25న రెండింటిలో, ఏప్రిల్‌ 9న తొమ్మిది కేంద్రాల్లో వేలం ప్రక్రియను ప్రారంభించారు. గతనెల 30 వరకు రోజు మార్చి రోజు వేలం నిర్వహిం చగా శనివారం అన్ని కేంద్రాల్లోనూ కొనసాగించారు. అయినప్పటికీ మార్కెట్‌ పోకడలో మాత్రం మార్పు కనిపించ లేదు. భారీగా బేళ్ల తిరస్కరణ కొనసాగుతోంది.

Updated Date - May 03 , 2026 | 02:23 AM