మార్కెట్‌లో అనిశ్చితి
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:39 AM
రాష్ట్రంలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు పూర్తిగా ప్రారంభం కాకుండానే మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వారంక్రితం దక్షిణాదిలోని పొదిలి, కందుకూరు కేంద్రాలు.. ఉత్తరాదిన రాజమండ్రి రీజియన్ పరిధిలోని ఐదు కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు. అక్కడ లభిస్తున్న ధరలు, కొనుగోళ్ల తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జీఎస్టీ పెంపునకు తోడైన యుద్ధం
కర్ణాటకలో పొగాకు ధరలు మరింత పతనం
కిలో గరిష్ఠ ధర రూ.200లోపునకు దిగజారిన వైనం
రోడ్డెక్కుతున్న అక్కడి రైతులు
తాజాగా హెచ్‌డీకోటి కేంద్రం వద్ద బేళ్లు తగులబెట్టి నిరసన
మన రాష్ట్రంపై మరింత ప్రభావం
దక్షిణాదిలోని రెండు కేంద్రాల్లో రోజు మార్చి రోజు కొనుగోళ్లు
9నుంచి మిగిలిన కేంద్రాల్లో వేలం
ధరలపై రైతుల్లో ఆందోళన
రైతు, వ్యాపార ప్రతినిధులతో బోర్డు అధికారుల సమావేశం
రాష్ట్రంలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు పూర్తిగా ప్రారంభం కాకుండానే మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వారంక్రితం దక్షిణాదిలోని పొదిలి, కందుకూరు కేంద్రాలు.. ఉత్తరాదిన రాజమండ్రి రీజియన్ పరిధిలోని ఐదు కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు. అక్కడ లభిస్తున్న ధరలు, కొనుగోళ్ల తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదేసమయంలో కాస్తంత మెరుగ్గా ఉండి మన రాష్ట్రంలో మార్కెట్ పోకడకు దిక్సూచిగా నిలిచే కర్ణాటక మార్కెట్ మరింత దిగజారింది. అక్కడ ధరలు భారీగా పతనమవ్వడంతో కర్ణాటక రైతులు రోడ్డెక్కారు. తాజాగా హెచ్‌డీ కోటి వేలం కేంద్రం రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టి బేళ్లను సైతం తగులబెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి రాష్ట్రంలో మిగిలిన 9 కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా మార్కెట్ పరిస్థితిపై రైతుల్లోనే కాక బోర్డు అధికారులు, వ్యాపార ప్రతినిధుల్లోనూ కొంత ఆందోళన కనిపిస్తోంది.
ఒంగోలు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్ ఆరంభంలోనే ఒడిదొడుకులకు గురవుతోంది. ధరలు తిరోగమనంలో ఉండగా, కర్ణాటక మార్కెట్ కూడా ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఆ ప్రభావం వేలం ప్రారంభమైన దక్షిణాది కేంద్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తాజా పరిస్థితులపై బోర్డు అధికారులు బుధవారం సాయంత్రం గుంటూరులో రైతు, వ్యాపార ప్రతినిధులు, వేలం కేంద్రాల అధికారు లతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. గత మూడేళ్లు రాష్ట్రంలో కొద్దిపాటి సమస్యలు, ఒడిదొడుకులు ఎదురైనా ఇతర పంటల కంటే పొగాకు రైతులకు ఎంతోకొంత లాభించింది. దీంతో ప్రస్తుత సీజన్‌లోనూ భారీగానే పంట సాగు చేశారు. మార్కెట్ ప్రమాదకర పరిస్థితులను గుర్తించి బోర్డు అధికారులు పంట ఉత్ప త్తి పరిమితిని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ ఇతర పంటలు సరిలేక రైతులు పొగాకువైపే మొగ్గుచూపారు. పొగాకు బోర్డు 2025-26 సీజన్‌కు రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా దాదాపు 229 మిలియన్ కిలోలు పండినట్లు అంచనా. అందులో దక్షిణాదిలోని రెండు రీజియన్ల పరిధిలో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న 11 కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్ కిలోలకు అనుమ తివ్వగా దాదాపు 146.90 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొదట్లో అనుకూలం..
కర్ణాటకలో గత సీజన్‌లో 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇస్తే 87 మిలియన్ కిలోలు పండినట్లు అంచనా వేశారు. మన రాష్ట్రంలో నాట్లు వేసే సమయంలోనే కర్ణాటకలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అక్కడ లభించే ధరలు, వేలం తీరు ఇక్కడ ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో పంటల సాగు, అనంతరం ధరలకు దిక్సూచిగా ఉంటాయి. అక్కడి పరిస్థితిని గమనిస్తూ ఇక్కడి రైతులు పంట సాగు చేస్తారు. కాగా కర్ణాటకలో ఈ ఏడాది కూడా మార్కెట్ ఆరంభం సానుకూలంగానే ఉంది. గరిష్ఠ ధరలు తొలిరోజుల్లో కిలోకు రూ.320 ఇచ్చిన వ్యాపారులు లోగ్రేడ్‌ను సైతం బాగానే కొన్నారు. సంక్రాంతి వరకూ అక్కడ మార్కెట్ బాగానే సాగింది. ఆ ప్రభావం దక్షిణాదిలో పంట సాగుపై కనిపించింది. విస్తారంగానే రైతులు పొగాకు సాగు చేశారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎదురొడ్డి పండించారు. ఎకరాకు సగటున రూ.2లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఖర్చు చేశారు. అలా పెట్టుబడులు కూడా భారీగానే పెరిగాయి. అదేసమయంలో బోర్డు అనుమతించిన దాని కన్నా ఈ ప్రాంతంలో దాదాపు 65శాతం మేర పంట అధికంగా పండింది. అలా ఉత్పత్తి ఖర్చులు పెరగడం, భారీగా పంట ఉత్పత్తి వంటి ప్రతికూల పరిణామాలతో ఆందోళన చెందుతున్న ఇక్కడి రైతులకు జనవరి ఆఖరులో కర్ణాటకలో ధరలు తగ్గడం మరింత ఆందోళనపరిచింది.
జీఎస్టీ పెంపుతో కుదేలు
కేంద్రం పొగాకు ఉత్పత్తులపై గతంలో ఉన్న 25శాతం జీఎస్టీని 40శాతానికి పెంచడంతో ఐటీసీతోపాటు పలు కీలక కంపెనీలు కొనుగోళ్లు తగ్గించాయి. ఆ ప్రభావం ధరలపై పడి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. సాధారణంగా ప్రారంభం రోజున ఇచ్చిన కిలో రూ.320 కంటే కనీసం 20శాతం పెరగాల్సింది పోయి దాదాపు 20శాతానికి తగ్గి కిలో రూ.280 వరకు చేరింది. ఇక నెలరోజుల నుంచి సాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం అక్కడి మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. పొగాకు ఎగుమతులలో ప్రధానమైన గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులతో వ్యాపారులు కొనుగోళ్లను తగ్గించారు. ఆ ప్రభావంతో పక్షం రోజులుగా కర్ణాటకలో ధరలు మరింత పతనమయ్యాయి. కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఒక్కో వేలం కేంద్రానికి రోజుకు 500 నుంచి 600 బేళ్లు వస్తుండగా పట్టుమని పదికి కూడా కిలో రూ.250 ధర లభించడం లేదు. దాదాపు 90శాతం బేళ్ల ధర కిలో రూ.180 నుంచి రూ.200లోపుగానే ఉంటున్నట్లు సమాచారం. దానిపై అక్కడి రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా హెచ్‌డీ కోటి కేంద్రం వద్ద రైతులు బేళ్లు తగులబెట్టి నిరసనకు దిగగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిణామాలు రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌పైనా తీవ్రంగానే కనిపిస్తున్నాయి.
కొనుగోళ్లు అంతంతమాత్రమే
దక్షిణాదిలోని పొదిలి, కందుకూరు కేంద్రాల్లో గతనెల 25న వేలం ప్రారంభమైంది. రైతులు అన్ని కేంద్రాల్లో చేపట్టాలని కోరినా వ్యాపారులు, బోర్డు అధికారులు సాహసించలేదు. అయితే ప్రారంభమైన రెండు కేంద్రాల్లోనూ పరిస్థితి బాగా లేదు. గత ఏడాది కిలో రూ.280 ప్రారంభ ధర ఇవ్వగా ఈ ఏడాది కర్ణాటక తరహాలో రూ.320ని ఇక్కడి రైతులు ఆశించారు. అయితే ఆశించిన ధర కాకపోయినా గత ఏడాది ధరను కూడా ఇవ్వకుండా తగ్గించి రూ.250 మాత్రమే ఇచ్చారు. దానిపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉండగా వారం నుంచి కొనుగోళ్లు కూడా సరిలేవు. తొలిరోజున రెండుచోట్లా వేలం నిర్వహించిన అధికారులు ప్రస్తుతం రోజు మార్చి రోజు పెడుతున్నారు. అది కూడా రోజుకు కనీసం వంద బేళ్లను కూడా కేంద్రానికి అనుమతించడం లేదు. ధరలు చూస్తే కిలో రూ.245 నుంచి రూ.250 ఇస్తుండగా ఇంచుమించు 10శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. రాజమండ్రి రీజయన్‌లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ తొలిరోజు కిలో రూ.265 ప్రారంభ ధర ఇచ్చారు. గత ఏడాది గరిష్ఠ ధర కిలో రూ.456 ఇచ్చిన వ్యాపారులు ఈ ఏడాది తొలిరోజున ఇచ్చిన రూ.265కు కొనేందుకు కూడా ఆసక్తిని చూపడం లేదు.
రైతులను వెంటాడుతున్న నష్ట భయం
మార్కెట్ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు ఈ ఏడాది దారుణంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం నాటి సగటు ధర కిలో రూ.267 లభిస్తేనే అంతోఇంతో లాభం వస్తుందని, ప్రస్తుత మార్కెట్ పోకడ ఇలాగే సాగితే సగటు ధర కిలో రూ.200 కూడా లభించే అవకాశం లేక ఆమేర నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 9 నుంచి దక్షిణాదిలో 9 వేలం కేంద్రాల్లో ప్రారంభం కావాల్సిన వేలంపై కూడా గందరగోళం నెలకొంది. కర్ణాటకలో ఇంకా 22 మిలియన్ కిలోల వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా ధరలు దిగజారడంతో అక్కడ వేలం ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఇక్కడి మార్కెట్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రైతు, వ్యాపార ప్రతినిధులు, వేలం కేంద్రాల అధికారులతో బుధవారం గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ నేతృత్వంలో ఈ స మావేశం జరిగింది. తొలుత కర్ణాటక మార్కెట్ తీరుపై సమీక్షించిన వారు అనంతరం రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు వేలం తీరు పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతేడాది మాదిరిగా ధరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపార ప్రతినిధులు జీఎస్టీ పెంపు, యుద్ధం ప్రభావం వంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేయగా రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా ధరల విషయంలో ముందుకు సాగాలని బోర్డు అధికారులు వ్యాపారులకు సూచించినట్లు తెలిసింది. ఈనెల 9నుంచి మిగిలిన వేలంకేంద్రాల్లో కొనుగోళ్లను యఽథావిధిగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.