అనిశ్చితి
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:43 AM
సహకార శాఖలో అనిశ్చితి నెలకొంది. ఏడాదిలోపే ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి అయిన డీసీవో పోస్టులో ఏకంగా నలుగురు అధికారులు మారడం అందుకు నిదర్శనం. పలు సహకార సంస్థలు వివాదాలలో చిక్కుకొని కీలక విచారణలు సాగుతున్న వేళ వాటన్నింటినీ సక్రమంగా సాగేలా చూడాల్సిన కీలకమైన డీసీవో పోస్టు అందుకు విరుద్ధంగా సాగుతోంది.
సహకార శాఖలో కుర్చీలాట
సంవత్సరంలోపే నలుగురు డీసీవోలు
గతేడాది మార్చిలో శ్రీనివాసరెడ్డి సరెండర్
అనంతరం ఇందిరాదేవి నియామకం
ఉన్నతాధికారులు ఎఫ్‌ఏసీ ఇవ్వక ఇక్కట్లు
ప్రస్తుత డీసీవో శ్రీలక్ష్మి ఆరు మాసాలకే సెలవులో వెళ్లిన వైనం
ఆ వెంటనే డీఎల్‌సీవోగా ఉన్న శ్రీనివాసరావుకు బాధ్యతలు
వివాదాలమయంగా సహకార సంస్థలు
సహకార శాఖలో అనిశ్చితి నెలకొంది. ఏడాదిలోపే ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి అయిన డీసీవో పోస్టులో ఏకంగా నలుగురు అధికారులు మారడం అందుకు నిదర్శనం. పలు సహకార సంస్థలు వివాదాలలో చిక్కుకొని కీలక విచారణలు సాగుతున్న వేళ వాటన్నింటినీ సక్రమంగా సాగేలా చూడాల్సిన కీలకమైన డీసీవో పోస్టు అందుకు విరుద్ధంగా సాగుతోంది. స్థానికంగా ఉన్న గందరగోళ పరిస్థితితోపాటు రాష్ట్రస్థాయి సహకార శాఖ అధికారుల తీరు కూడా ఇందుకు కారణమైంది. కోల్‌సొసైటీపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చి సెక్షన్ 52 విచారణ జరుగుతుండగా ప్రస్తుతం డీసీవోగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి సెలవులో వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఆ వెంటనే ఆ పోస్టులో ఒంగోలు డీఎల్‌సీవో శ్రీనివాసరావును ఇన్‌చార్జ్‌గా ఉన్నతాధికారులు నియమించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఒంగోలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని వందలాది సహకార సంస్థలను పర్యవేక్షించే జిల్లా సహకారశాఖలో కుర్చీలాట సాగుతోంది. ఏడాదిలో నలుగురు డీసీవోలు మారారు. అదీ కీలకమైన విచారణల సమయాల్లో మారడం గమనార్హం. జిల్లా సహకారాధికారి పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ వంటి జిల్లాస్థాయి, ఒంగోలు కేంద్రంగా ఉన్న పొగాకు సమాఖ్య, కోల్‌సొసైటీ వంటి రాష్ట్రస్థాయి సంస్థలతోపాటు వందలాది రైతు, ఇతర వర్గాల సహకార సంస్థలు పనిచేస్తుంటాయి. కాగా వైసీపీ పాలనలో జిల్లా, రాష్ట్రస్థాయి పలు సహకార సంస్థలలో అడ్డగోలుగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక పాలక పెద్దలకు అందిన ఫిర్యాదులతో వరుసగా ఒకదాని వెంట ఒకదానిపై విచారణలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో గతేడాది ఫిబ్రవరిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)పై నాటి కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ సమయంలో డీసీవోగా ఉన్న శ్రీనివాసరెడ్డి తగువిధంగా కాకుండా కలెక్టర్‌ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించా రన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఉండే పొగాకు సమాఖ్యలకు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా చిన్నస్థాయి ఉద్యోగిని నియమించడం వంటి పరిణామాలతో జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గత ఏడాది మార్చి 27న డీసీవో శ్రీనివాసరెడ్డిని అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సాధారణంగా కలెక్టర్ అలా నిర్ణయం తీసుకుంటే వెంటనే ప్రత్యామ్నాయ నియామకాన్ని ఉన్నతాధికారులు చేయాల్సి ఉన్నా సహకారశాఖ ఉన్నతాధికారులు రెండు వారాలకుపైగా స్పందించలేదు. దీంతో స్థానిక అవసరాల దృష్ట్యా ఏప్రిల్ రెండో వారంలో అప్పుడు డీసీసీబీలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న ఇందిరాదేవికి డీసీవో ఇన్‌చార్జ్ బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. అయితే దాన్ని సహకారశాఖ ఉన్నతాధికారులు మూడు మాసాలపాటు ధ్రువీకరించకపోవడంతో ఆ శాఖలో అధికారిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. చివరకు ఆ శాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగుల జీతాలు ఆగిపోయి రోడ్డెక్కడం, ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరిపై ఆంధ్రజ్యోతిలో వరుస కధనాలు రావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నారు. మూడు మాసాల అనంతరం ఇందిరాదేవికి ఉన్నతాధికారులు ఎఫ్‌ఏసీ ఇచ్చారు.
ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం
అనంతరం రెండు నెలలకు శ్రీలక్ష్మి అనే అధికారిని రెగ్యులర్ డీసీవోగా ఉన్నతాధికారులు నియమించారు. అలా గత సెప్టెంబరులో శ్రీలక్ష్మి ఇక్కడ డీసీవోగా బాధ్యతలు స్వీకరించగా అనంతరం కూడా పలు సహకార సంస్థలలో గతంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమ వ్యవహారాలు, వాటిపై విచారణలు, ఇతరత్రా పలు అంశాలపై తీవ్ర ఒత్తిడి ఆమెపై కొనసాగుతూనే ఉంది. నెలక్రితం కోల్‌సొసైటీలో అక్రమ వ్యవహారాలపై కొందరు హైకోర్డులకు వెళ్లిన నేపథ్యంలో సెక్షన్ 52 విచారణ చేయక తప్పని పరిస్థితి నెలకొనగా అసిస్టెంట్ రిజిస్ర్టార్ సురేంద్రను విచారణాధికారిగా డీసీవో నియమించారు. సూపర్‌బజార్‌పైనా అలాంటి విచారణకు ఆదేశించారు.
కీలక ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర ఒత్తిడి
ఈ విషయాలలో కొంత మంది ఉన్నతాధికారులు, గతంలో ఇక్కడ సహకారశాఖలో పనిచేసి ఇప్పటికీ పరోక్షంగా పెత్తనంచేస్తున్న వారు, కోల్‌సొసైటీ పాలకమండలికి మద్దతుగా నిలుస్తున్న ఒక ప్రజాప్రతినిధి నుంచి ఆమె ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీవో శ్రీలక్ష్మి మంగళవారం సెలవులో వెళ్లిపోయారు. ఆవెంటనే ప్రసుతం ఒంగోలు డీఎల్‌సీవోగా ఉన్న శ్రీనివాసరావుకు ఇన్‌చార్జ్ డీసీవో బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో శ్రీనివాసరెడ్డిని సరెండర్ చేసినప్పుడు దాదాపు మూడు మాసాలు ఎలాంటి ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయ లేదు. తరువాత ఇందిరాదేవిని ఇన్‌చార్జ్ డీసీవోగా కలెక్టర్ నియమించినప్పుడు దాదాపు మూడు మాసాలుపాటు ఎఫ్‌ఏసీ ఇవ్వకుండా వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి మెడికల్ లీవులో వెళ్లిన వెంటనే ఒంగోలు డీఎల్‌సీవోకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వడంపై సహకార శాఖ వర్గాలలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌సొసైటీపై కీలక విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి.