Share News

పంట ఉత్పత్తులకు దక్కని బ్యాంక్‌ రుణాలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:14 AM

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులకు విలువ లేకుండా పోయింది. ఈ వ్యవసాయ ఉత్పత్తులను తనఖా ఉంచుకుని గతంలో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చేవారు. వివిధ కారణాలతో వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు.

పంట ఉత్పత్తులకు దక్కని బ్యాంక్‌ రుణాలు
గోడౌన్లలో నిలువ ఉన్న ధాన్యం బస్తాలు

రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కు

ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు

గిద్దలూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులకు విలువ లేకుండా పోయింది. ఈ వ్యవసాయ ఉత్పత్తులను తనఖా ఉంచుకుని గతంలో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చేవారు. వివిధ కారణాలతో వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. మార్కెట్‌ మాయాజాలాలతో రైతుల చేతికి పంట అందేసమయంలో రేట్లు ఒక్కసారిగా నేలచూపులు చూస్తాయి. రేట్లు పెరిగినపుడు అమ్ముకునేందుకు వీలుగా రైతులు తమ ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరేజీలలో, గోడౌన్లలో అద్దె ఇచ్చి నిల్వ ఉంచుతారు. ఈ ఉత్పత్తులపై గతంలో బ్యాంకర్లు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఒక్కోసారి సగానికి పైగా ధర తగ్గిపోయి మళ్లీ పెరిగేందుకు ఏళ్లు పడుతుండడంతో ఇచ్చిన రుణాల రికవరీకి బ్యాంకర్లకు సమస్యగా మారుతున్నది. ఉత్పత్తులు అమ్మితే తప్ప అసలు, వడ్డీ కట్టలేని పరిస్థితి రైతుల వద్ద ఉండగా దారుణంగా రేట్లు పడిపోయిన సందర్భాలలో రుణాలను రైతులు సకాలంలో చెల్లించలేక పోతున్నారు. దాంతో బ్యాంకర్లు ఆ ఉత్పత్తులను వేలం వేస్తే ఇచ్చిన అప్పు కూడా ఒక్కోసారి తిరిగిరాని పరిస్థితి నెలకొంటున్నది. దాంతో బ్యాంకర్లు నష్టపోతున్నారు. దాంతో గత నాలుగైదు ఏళ్లుగా వ్యవసాయ ఉత్పత్తులకు రుణాలు ఇవ్వడం క్రమేణా మానేశారు. రూపాయికి పావలా కూడా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడి అధిక వడ్డీలు చెల్లిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, బేస్తవారపేట ప్రాంతాలలో 3 కోల్డ్‌ స్టోరేజీలు ఉండగా గిద్దలూరుతోపాటు మిగతా మండలాలలో నాలుగైదు నాన్‌ ఏసీ గోడౌన్లు ఉన్నాయి. రైతులు ప్రధానంగా పప్పుశనగ, కంది, నువ్వు, పెసలు, ఉలవలు లాంటి పంటలను రేట్లు లేని సందర్భాలలో ఏసీ, నాన్‌ ఏసీ గోడౌన్లలో బస్తాకు ఇంత అని అద్దె చెల్లించి నిలువ చేస్తున్నారు. అవసరాల కోసం ఆ ఉత్పత్తులను ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు ఉంచి రుణాలు పొందుతారు. పరిస్థితిని బట్టి రూపాయి లేదా రూ.2 వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. ఒకవైపు అద్దె భారం, మరో వైపు వడ్డీ భారంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాలకులు, అధికారులు చొరవ తీసుకుని బ్యాంకర్లతో ఒప్పించి రుణాలు ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కనిపించని రైతు బంధు పథకం

మార్కెట్‌యార్డులలో గతంలో రైతులకు చెందిన ఉత్పత్తులను నిలువ ఉంచుకుని నిర్ణీత సమయం వరకు వడ్డీ లేకుండానే రుణాలు ఇచ్చేవారు. సమయం దాటితే నామమాత్రం అద్దె, వడ్డీ వసూలు చేసేవారు. చిన్న సన్నకారు రైతులకు ఈ రైతు బంధు పథకం ఎంతో ఉపయోగంగా ఉండేది. కానీ మార్కెట్‌యార్డులు కూడా సెస్‌ వసూలు పట్ల చూపిస్తున్న ఆసక్తి రైతు బంధు పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంలో చూపించడం లేదు. నియోజకవర్గంలో గిద్దలూరు, కంభంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో పలు గోడౌన్లు నిర్మించారు. రైతు బంధు పథకాన్ని ఎత్తివేయడంతో ఈగోడౌన్లను అద్దెకు ఇచ్చి అద్దెను కమిటీలు పొందుతున్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి రైతు బంధు పథకాన్ని తిరిగి పునరుద్దరించి చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు నామమాత్రం అద్దెతో వడ్డీలేని రుణాలను అందించి ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Feb 06 , 2026 | 12:14 AM