దివ్యాంగులకు ఉగాది కానుక
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:48 AM
జిల్లాలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. బుధవారం నుంచి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.
నేటి నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం
దివ్యాంగ శక్తి పేరుతో అమలు
అమరావతిలో సీఎం చంద్రబాబు, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలచే ప్రారంభం
ఉమ్మడి జిల్లాలో సుమారు 40,490 మందికి లబ్ధి
ఒంగోలు కార్పొరేషన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. బుధవారం నుంచి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోసుమారు 40,490 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పింఛన్‌ను వైకల్యాన్ని బట్టి రూ.6వేలు, రూ.10వేలు, దీర్ఘకాలికంగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు ప్రతినెలా అందిస్తోంది. తాజాగా ఉగాది సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని ఆర్టీసీ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం గతేడాది ఆగస్టు 15న స్త్రీశక్తి ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో లక్షలాది మంది వనితలు ఆ పథకాన్ని సద్వినియోగం చేసూకుంటూ సురక్షిత ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ఉగాది రోజున దివ్యాంగుల కోసం అమలులోకి తీసుకొస్తున్న దివ్యాంగ శక్తి పథకం వారిలో నూతనోత్సాహాన్ని నింపనుంది. 40శాతం వైకల్యం కలిగిన వారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్న విధంగానే దివ్యాంగ శక్తి ద్వారా పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఇప్పటి వరకూ ఆయా బస్సుల్లో 50శాతం రాయితీతో దివ్యాంగులు ప్రయాణిస్తున్నారు. ఇకపై పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చు. 100శాతం వైకల్యం ఉంటే లబ్ధిదారుడితోపాటు అతని సహాయకుడికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర బస్సులు, అలా్ట్ర డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లలో ఇప్పుడున్నట్లుగానే 50శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉంది.
నేడు నియోజకవర్గాల వారీగా ప్రారంభం
రాష్ట్రప్రభుత్వం దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా కేవలం ఒక ప్రాంతంలోనే ప్రారంభోత్సవాలుకాకుండా, నియోజకవర్గాల వారీగా దివ్యాంగుల సమక్షంలో అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు ఒంగోలులో జరిగే కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్‌కుమార్ పాల్గొననున్నారు. అందుకు అనుగుణంగా ప్రకాశం రీజియన్ మేనేజరు జి.సత్యనారాయణ అవసరమైన ఏర్పాట్లు చేశారు. బస్ ప్రారంభోత్సవంలో భాగంగా బస్సులో ప్రయాణించే దివ్యాంగులకు స్థానిక శాసనసభ్యుడు జనార్దన్ విందు ఏర్పాటు చేయనున్నారు.