నేడు ఒంగోలులో రెండేళ్ల వేడుక
ABN , Publish Date - Jun 18 , 2026 | 02:58 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి వేడుకల కార్యక్రమం గురువారం ఒంగోలులో జరగనుంది. ‘రెండేళ్ల నమ్మకం- సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వేడుకలను నిర్వహిస్తోంది.
కూటమి పాలన విజయాలపై ప్రత్యేక సభ
హాజరుకానున్న ముగ్గురు మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు
కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో యంత్రాంగం ఏర్పాట్లు
జిల్లావ్యాప్తంగా తరలిరానున్న మూడు పార్టీల శ్రేణులు
ఒంగోలు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి వేడుకల కార్యక్రమం గురువారం ఒంగోలులో జరగనుంది. ‘రెండేళ్ల నమ్మకం- సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వేడుకలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయి వేడుకలు ప్రధానంగా కూటమికి చెందిన ఎమ్మెల్యేల సారథ్యంలో చేపట్టారు. జిల్లాస్థాయి సంబరాల్లో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. దీంతో కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్డులో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో జిల్లా వేడుకలకు ఒక ప్రత్యేక అంశాన్ని ప్రభుత్వం చర్చకు కేటాయించింది. అందులో జిల్లాకు జలధార-జలహారతి అంశాన్ని ఇచ్చింది. తదనుగుణంగా స్టాల్స్, హోర్డింగ్‌లు, ఏవీలను అధికారులు సిద్ధం చేశారు. కీలక ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా ప్రజలకు అందిన సంక్షేమ, అభివృద్ధి అంశాలపై నివేదికలు రూపొందించారు. ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించి పలు సూచనలు చేశారు.
వేలాదిగా రానున్న లబ్ధిదారులు, శ్రేణులు
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యేలా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పలు ముఖ్యమైన పథకాల లబ్ధిదారులను ఆయా శాఖల అధికారులు కూడా తీసుకువస్తున్నారు. అలా వేలాది మంది వివిధ వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటుండగా, గ్రామస్థాయి నాయకులంతా హాజరయ్యేలా చూడటంతోపాటు వేడుకకు హాజరయ్యే వారందరికీ రవాణా, భోజనాలు వంటి ఏర్పాట్లను టీడీపీ నేతలు చూస్తున్నారు. ఈవేడుకలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఇతర కీలక ప్రజాప్రతినిఽధులు, ముఖ్యనేతలతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీ ముఖ్యనాయకులు పాల్గొంటున్నారు. కలెక్టర్ రాజాబాబుతోపాటు ముఖ్యమైన అధికారులందరూ హాజరవుతున్నట్లు సమాచారం.