Share News

రెండు జిల్లా పరిషత్‌లు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:28 PM

జిల్లా పరిషత్‌ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌ రెండు పూర్తిస్ధాయి జిల్లాలతోపాటు కొంతభాగం బాపట్లలోకి వెళ్లనుంది.

రెండు జిల్లా పరిషత్‌లు

ఒంగోలులో కొనసాగింపుతోపాటు

కొత్తగా మార్కాపురం జడ్పీ ఏర్పాటు

ఈసారి ఎన్నికలు ఆ ప్రకారమే నిర్వహణ

బాపట్ల జడ్పీ పరిధిలోకి పర్చూరు,

చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలు

ఒంగోలు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిషత్‌ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌ రెండు పూర్తిస్ధాయి జిల్లాలతోపాటు కొంతభాగం బాపట్లలోకి వెళ్లనుంది. గత జడ్పీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఆ ప్రాతిపదికన 13 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. అలా 21 సెప్టెంబరులో ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఏర్పడగా దర్శి జడ్పీటీసీగా వైసీపీ తరఫున గెలుపొందిన బూచేపల్లి వెంకాయమ్మ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 56 మండలాలతో జడ్పీ పాలకవర్గం ఏర్పడింది. అనంతరం 2022 ఏప్రిల్‌లో రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరిగి ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు బాపట్ల జిల్లాలోకి, మరికొన్ని నెల్లూరు జిల్లాలోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగింది. మరోసారి జిల్లాల పునర్విభజన గతేడాది డిసెంబరు 31న జరగ్గా ఉమ్మడి జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఉన్న మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటైంది. తొలి విభజన సమయంలో బాపట్ల జిల్లాలోకి వెళ్లిన అద్దంకి నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలోకి వెళ్లిన కందుకూరు నియోజకవర్గాలు తిరిగి ప్రకాశంలోకి వచ్చాయి. బాపట్లలోకి వెళ్లిన పర్చూరు, చీరాల అందులోనే ఉండిపోయాయి. అలా పలుమార్లు విభిన్న రూపాలుగా జిల్లా పునర్విభజన జరిగినా జిల్లా పరిషత్‌ ఉమ్మడిగానే కొనసాగుతోంది.

ఆరు నెలల్లో ముగియనున్న పదవీకాలం

ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జడ్పీ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుత జడ్పీ పాలకవర్గం పదవీకాలం మరో ఆరు మాసాలలో ముగియనుంది. ఈలోపు వాటికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనలు పరిశీలిస్తే త్వరగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా స్థానిక సంస్థల పాలకవర్గాలకు సంబంధించి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జిల్లా యూనిట్‌గానే జడ్పీ ఉండాలి. ఆ ప్రకారం ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కొత్త జిల్లాల యూనిట్‌గా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు అనివార్యం. జడ్పీ ఎన్నికలు కొత్త జిల్లా ప్రాతిపదికన మాత్రమే నిర్వహించాల్సి ఉండటంతో అందుకు అవసరమైన అనుమతులను తీసుకునే యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


అనుమతులు రాగానే మార్పు

అనుమతులు రాగానే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌లన్నింటినీ కొత్త జిల్లాల ప్రాతిపదికన ఏర్పాటుకు గెజిట్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ ప్రకారం ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్‌ రానున్న రోజుల్లో రెండు జడ్పీలుగా మారనుంది. ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లా పరిషత్‌ పరిధిలోకి ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కందుకూరు. అద్దంకి, దర్శి నియోజకవరాల్గోని మండలాలు వస్తాయి. మార్కాపురం కేంద్రంగా ఏర్పడనున్న కొత్త జిల్లా పరిషత్‌ పరిధిలోకి మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల్లోని మండలాలు రానున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో ఉన్న పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని మండలాలు బాపట్ల జడ్పీలోకి వెళ్లనున్నాయి. ఇదిలాఉండగా ఉమ్మడి జిల్లా పరిషత్‌చైర్‌ పర్సన్‌గా ప్రస్తుత చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ చివరి వారు కానున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:28 PM