రెండేళ్ల పాలన ప్రజా విశ్వాసానికి నిదర్శనం
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:52 PM
ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాదరణతో దూసుకుపోతోందని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం ఘనం గా జరిగింది.
కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో
ఘనంగా విజయోత్సవ సభ
సంక్షేమం, అభివృద్ధి
రెండు చక్రాలుగా రాష్ట్ర ప్రగతి
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాదరణతో దూసుకుపోతోందని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం ఘనం గా జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సుపరిపాలన అందించిందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేసిందని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పనలో ప్రభుత్వం విశేష ఫలితాలు సాధించిందన్నారు. నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని తెలిపారు. కనిగిరి నగరంలో బైపాస్ రోడ్డు, ఏబీఆర్ కాలేజి నుంచి బైపాస్ వరకు రహదారి నిర్మాణం, ప్రధాన రహదారులపై డివైడర్లు, వీధి దీపాలు ఏర్పాటు ద్వారా రాకపోకలు మెరుగుపడ్డాయన్నారు. విద్యారంగం అభివృద్ధికి కనిగిరి ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కస్తూర్భా గాంధీ పాఠశాల, మోడల్‌స్కూల్‌లలో మౌలిక వసతుల విస్తరణ చేపట్టామని చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులు కూడా ముందుకు వేగంగా సాగుతున్నాయన్నారు. జనసేన ఇంచార్జి వరికూటి నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకాలు, అక్రమాలు పెరిగాయని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేద, గిరిజన, దళిత వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా కృష్ణారెడ్డి, ఫిరోజ్, సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్), యారవ శ్రీను, ఇంద్రభూపాల్, అధికారులు ఆర్డీవో తోట అజయ్‌కుమార్, డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, జనసేన, బీజేపి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్ : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కె ట్ యార్డు ప్రాంగణంలో రెండేళ్ల పాలనపై మంగళవారం మార్కాపురం నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20వేలు ఖాతాలకు జమ చేశారన్నారు. తల్లికి వందనం ద్వారా ఇం ట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ రూ.15వేలు, ఆటో డ్రైవర్‌లకు రూ.10వేలు అందించామన్నారు. మహిళలకు స్ర్తీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుం డా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు కందుల రామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు, టీడీపీ, జనసేన నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.