ప్రజాక్షేత్రంలోకి రెండేళ్ల విజయాలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 03:01 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజయా లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం భాగస్వామ్య పార్టీలతో కలిసి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలకు సిద్ధమవుతోంది.
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు
17న మార్కాపురం, 18న ఒంగోలులో నిర్వహణ
కూటమి పార్టీల నేతలు భాగస్వామ్యం
నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఏర్పాటు
ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక్కో అంశంపై చర్చ
తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కీలక నేతలు
ఒంగోలు, జూన్ 12(ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు సాధించిన విజయా లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం భాగస్వామ్య పార్టీలతో కలిసి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలకు సిద్ధమవుతోంది. రెండేళ్లు పూర్తి సందర్భంగా తిరుపతి సమీపంలో శుక్రవారం భారీ సభను కూటమి తరఫున నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ సాధించిన విజయా లను వివరించడంతోపాటు భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు పార్టీ ముఖ్యనేతలందరూ ఆ సభకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు ఇతర ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో..
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా విజయోత్సవ సభలు నిర్వహించ నున్నారు. ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో జిల్లాస్థాయి, స్థానికంగా ఎమ్మె ల్యేలు, ఇన్‌చార్జిల సారథ్యంలో నియోజకవర్గ స్థాయి సభలు నిర్వహించ నున్నారు. ఇందుకు సంబంధించి కూటమి పార్టీల తరఫున అధిష్ఠానం నుంచే జిల్లాస్థాయిలో ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనేది సూచించారు. ఆ ప్రకారం ఈనెల 17న మార్కాపురంలో, 18న ప్రకాశం జిల్లా సభ ఒంగోలులో జరగనుంది. నియోజకవర్గాల సభలను ఈనెల 15 నుంచి 20లోపు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకున్న కీలక అంశాలపై ఒక్కో చోట ఒక్కో దానిపై ప్రధాన చర్చ జరిగేలా థీమ్‌ను కూడా ఎంపిక చేశారు. అలా ఒంగోలులో జరిగే జిల్లా సభకు మాదకద్రవ్యాల నివారణ అంశాన్ని ఇచ్చారు. తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్సవాలకు హాజరైన కీలక నేతలు ఇప్పుడు జిల్లా, నియోజకవర్గ కార్యక్రమాలపై దృష్టి సారించారు.