Share News

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మహిళల మృతి

ABN , Publish Date - Sep 06 , 2026 | 02:57 AM

కూలీల బతుకులు తెల్లారిపోయాయి. ఆగి ఉన్న లారీని మినీ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో అందులో ఉన్న ఇరువురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ తీవ్రగాయాలతో బయటపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మహిళల మృతి
ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్నమినీలారీ ముందుభాగం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీలారీ

ఒంగోలు సమీపంలో ఘటన

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కూలీల బతుకులు తెల్లారిపోయాయి. ఆగి ఉన్న లారీని మినీ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో అందులో ఉన్న ఇరువురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఒంగో లులోని సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. మినీలారీలో ప్రయాణిస్తున్న పల్నాడు జిల్లా అమరావతి మం డలం దిడుగు గ్రామానికి చెందిన చలమచర్ల వెంకట్వేరమ్మ (27), బాపట్ల తిరుపతమ్మ(24) మృతి చెందారు. విజయవాడలోని ఎనికపాడుకు చెందిన మినీలారీ డ్రైవర్‌ శివరాంబాబు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మైలవరం నుంచి ఇటుకల లోడుతో వెళుతున్న లారీ మరమ్మతులకు గురై ఒంగోలు దక్షిణం వైపున ఉన్న సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో ప్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆగి ఉంది. తెల్లవారుజామున 4.15కు విజయవాడ నుంచి నెల్లూరుకు టెంట్‌ సామానులు వేసుకొని వెళుతున్న మినీ లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. మినీ లారీలో కూలి పనులకు వెళుతున్న వెంకటేశ్వరమ్మ, తిరుపతమ్మ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు కేబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడి మృతిచెందారు. లారీ డ్రైవర్‌ శివరాంబాబు వాహనంలో నుంచి దూకడంతో గాయాలపాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ఎస్సై ఫిరోజ్‌ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మినీలారీ ముందు ఉన్న లారీలో ఇరుక్కుపోయింది. దీంతో అగ్నిమాపకశాఖ, జాతీయ రహదారి సిబ్బంది అక్కడకు చేరుకుని మినీలారీని వెనుక్కు లాగారు. అదే సమయంలో అగ్నిమాపకశాఖ రాడ్‌లను కట్టర్‌తో కట్‌ చేశారు. మినీలారీలో ఉన్న మృతదేహాలను బయటకు తీసి రిమ్స్‌కు తరలించారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 02:57 AM