Share News

రెండు నెలలు.. రూ.124 కోట్లు

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:33 AM

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధుల వినియోగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో సంబంధిత పనుల పూర్తిపై డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రెండు నెలలు.. రూ.124 కోట్లు
అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌

ఉపాధి పథకం మెటీరియల్‌ నిధుల వినియోగంపై డ్వామా అధికారుల కసరత్తు

మండలస్థాయి ముఖ్య అధికారులు, సిబ్బందితో పీడీ జోసఫ్‌కుమార్‌ సమీక్షలు

రూ.65 కోట్లతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయిన్‌లు, ఇతర పనులు

రూ.45 కోట్లతో మినీగోకులాల నిర్మాణం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధుల వినియోగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో సంబంధిత పనుల పూర్తిపై డ్వామా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుత ఏడాది నిధులు కొంత మేర తక్కువగానే అందుబాటులో ఉండటంతో పనుల మంజూరు విషయమై అధికారులు ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అందుబాటులో ఉన్న నిధులు, ఇప్పటి వరకూ ఖర్చు చేసిన మొత్తం, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న సిఫార్సులను పరిశీలించారు. నెలరోజులుగా ఈ ప్రక్రియను కొనసాగించారు. లెక్కలు తేల్చి పనుల పూర్తిపై దృష్టి సారించారు.

ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం కూలీలకు లభించే వేతన మొత్తానికి మూడింట రెండొంతుల మేర మెటీరియల్‌ కోటా కింద నిధులు అందుబాటులోకి వస్తాయి. అంటే మొత్తం పథకం వ్యయంలో 60శాతం వేతనాలు, 40శాతం మెటీరియల్‌ కింద ఉంటాయి. ఆ ప్రకారం జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్‌ కోటా కింద సుమారు రూ.189 కోట్ల మేర నిధులు అందుబాటులో ఉంటాయని గుర్తించారు. వాటిలో ఇప్పటికే సుమారు రూ.65 కోట్లు ఖర్చు చేశారు. అందులో కొంత మేర గత ఏడాది పెండింగ్‌ బిల్లులు చెల్లింపు చేసినవి కూడా ఉన్నాయి. ఇక దాదాపు రూ.124 కోట్ల మేర మెటీరియల్‌ కోటా నిధులు అందుబాటులో ఉండగా ఆ మొత్తాన్ని మార్చి ఆఖరులోపు ఖర్చు చేసి సంబంధిత బిల్లులను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే మంజూరు చేసిన పనులను మార్చి 15 నాటికి పూర్తి చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.124 కోట్లలో రూ.65 కోట్లను వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అనుగుణంగా గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌లు, ఇతర పనులకు కేటాయించారు. వాటిని ఇటీవలే మంజూరు చేశారు. మెటీరియల్‌ కోటా నిధుల కింద డ్వామా ద్వారా చేపట్టే మినీ గోకులాల నిర్మాణాలు, పండ్లతోటల పథకం, మొక్కల పెంపకం ఇతరత్రా పథకాలకు సుమారు రూ.45 కోట్లు వ్యయం కానుంది. మరో రూ.15 కోట్ల బిల్లులు ఇటీవలే అప్‌లోడ్‌ చేశారు. ఆ మేరకు నిధులు అందుబాటు, చేయాల్సిన పనులపై స్పష్టత వచ్చింది.

పనుల పూర్తిపై డ్వామా అధికారుల దృష్టి

తక్షణం పనుల పూర్తి, బిల్లుల అప్‌లోడ్‌పై జిల్లాలోని డ్వామా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం జిల్లా విభజన జరిగినప్పటికీ మార్చి ఆఖరు వరకు ఇలాంటి పలు శాఖల పథకాలను పూర్వపు జిల్లానే యూనిట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రెండు జిల్లాల పరిధిలో మండలస్థాయి అధికారులతో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ బుధ, గురువారాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మార్కాపురంలో బుధవారం మార్కాపురం, కనిగిరి, వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లతో ఆయన సమీక్ష చేశారు. గురువారం ఒంగోలులో ఒంగోలు, కొండపి సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల అధికారులతో ఆ తరహా సమావేశాన్ని నిర్వహించారు. మంజూరైన పనులను మార్చి 15 నాటికి పూర్తిచేసి బిల్లులను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 24 , 2026 | 02:33 AM