కీలక సూచికల్లో రెండు జిల్లాలకు గ్రేడ్ ఏ
ABN , Publish Date - May 08 , 2026 | 03:01 AM
స్థూల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కీలక సూచికలలో రెండు జిల్లాలూ గతేడాది ఏ గ్రేడ్‌లో నిలిచాయి. వంద పాయింట్లకు ప్రకాశంకు 86, మార్కాపురం జిల్లాకు 83 లభించాయి.
వంద విజయాల్లో వెలిగొండ ప్రాజెక్టు
రెండు జిల్లాల్లో రూ.88,749 కోట్లు
ఈ ఏడాది స్థూల ఉత్పత్తుల లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రభుత్వం
ప్రకాశంలో సేవారంగం, మార్కాపురంలో
వ్యవసాయ రంగాల ద్వారా అధిక రాబడి
ఈ సీజన్‌లో రెండు జిల్లాలపై ఎల్‌నినో
కలెక్టర్‌ల సదస్సులో వెల్లడించిన ప్రభుత్వం
నివేదికలతో హాజరైన రాజాబాబు, విజయ సునీత
పలు కీలక అంశాలపై సీఎం సమీక్ష
ప్రాధాన్యతలపై దిశానిర్దేశం
స్థూల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కీలక సూచికలలో రెండు జిల్లాలూ గతేడాది ఏ గ్రేడ్‌లో నిలిచాయి. వంద పాయింట్లకు ప్రకాశంకు 86, మార్కాపురం జిల్లాకు 83 లభించాయి. వివిధ అంశాలపై రాష్ట్ర సగటు, జిల్లాల వారీ పురోగతి వివరాలను ప్రభుత్వం గురువారం అమరావతిలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ప్రకటించింది. స్వచ్ఛాంధ్ర, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ, కుటుంబ సర్వే, కేంద్ర పథకాల అమలు తదితర విషయాల్లో రెండు జిల్లాలు వెనుకబాటులోనే ఉన్నాయి. 23నెలల ప్రజాప్రభుత్వ పాలనలో సాధించిన వంద విజయాల్లో వెలిగొండ ఉంది. వచ్చే జూలైకి ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఒంగోలు, మే 7 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంపుపై దృష్టిసారిం చిన ప్రభుత్వం తదనుగుణంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల స్థూల ఉత్పత్తిని పెంచి లక్ష్యాలను నిర్దేశించింది. రెండు జిల్లాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సుమారు రూ.88,749కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. అందులో ప్రకాశం జిల్లా లక్ష్యం రూ.55,812 కోట్లు కాగా, మార్కాపురం జిల్లా లక్ష్యం రూ.32,937 కోట్లుగా ఉంది. ప్రకాశం స్థూల ఉత్పత్తుల్లో అధిక రాబడి సర్వీసు సెక్టారు నుంచి కాగా, మార్కాపురంలో వ్యవసాయ అను బంధ రంగాల ద్వారా ఉంటుందని అంచ నా వేశారు. గతేడాది కన్నా సుమారు 13 నుంచి 15శాతానికిపైగా ఈ లక్ష్యాలను నిర్ణయించారు. అమరావతిలోని సచివాల యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో తొలిరోజైన గురువారం రాష్ట్ర, జిల్లాల వారీ స్థూల ఉత్పత్తి(జీడీపీ) పై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆయా రంగాలవారీ కీలక అంశాలపై సమీక్ష చేసి తదుపరి చర్యలు, ప్రభుత్వ ప్రాఽధాన్య తలపై దిశానిర్దేశం చేశారు.
ప్రకాశానికి 19వ స్థానం
తలసరి ఆదాయం లక్ష్యాలను కూడా సీఎం వివరించారు. గత ఏడాది రూ.48,364 కోట్ల స్థూల ఉత్పత్తితో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రూ.55,812 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఏడాది కన్నా 15.10 శాతం పెంచారు. జిల్లా మొత్తం స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా రూ.20,488 కోట్లు సర్వీసు సెక్టారు నుంచి అంచనా వేశారు. రూ.18,853 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలు, రూ.12,151 కోట్లు పారిశ్రామిక రంగం నుంచి లెక్క కట్టారు. గతేడాది జిల్లాలో తలసరి ఆదాయం రూ.2,35,304గా ఉండగా 15.12 శాతం పెంచి ఈ ఏడాది రూ.2,70,876గా నిర్ణయించారు.
మార్కాపురం జిల్లాకు 21స్థానం
మార్కాపురం జిల్లాకు సంబంధించి చూస్తే ఆ జిల్లాలో గత ఏడాది రూ.28,994 కోట్లు స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో 21వ స్థానంలో ఉండగా ప్రస్తుత ఏడాది సుమారు 13.60శాతం పెంపుతో రూ.32,937 కోట్లుగా నిర్ణయించారు. అందులో అధికంగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రూ.14,406 కోట్లు, సర్వీసు సెక్టారు నుంచి రూ.11,960 కోట్లు, పారిశ్రామికరంగం ద్వారా రూ.3,778 కోట్లు అంచనా వేశారు. మార్కాపురం జిల్లాలో గతేడాది రూ.2,16,667 ఉండగా 13.33శాతం పెంచి ఈ ఏడాది రూ.2,45,538 కోట్లుగా నిర్ణయించారు.
భయపెడుతున్న ఎల్‌నినో
ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటల సాగులో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రకటించింది. జిల్లాల వారీ ఏనెలలో ఎంత వర్షపాతం లోటు ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఆ ప్రభావం రెండు జిల్లాలపై తీవ్రంగానే ఉంటుంది. జూన్ నుంచి అక్టోబరు వరకు ఐదు నెలలపాటు సగటున 13 నుంచి 37శాతం ఆయా నెలల్లో లోటు వర్షపాతం ఉండనుంది. దీనివల్ల అపరాలు, మిర్చి నిమ్మ, బత్తాయి తదితర పంటలకు ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేశారు.
కీలక అంశాలపై సమీక్ష
తొలిరోజు అజెండాలో జీడీపీ, రెవెన్యూ, ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, కేంద్రప్రభుత్వ పథకాల అమలు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ, ఉపాధి కల్పన, విద్య, వైద్యరంగాలపై సమీక్ష జరిగింది. సంబంధిత అంశాలపై నివేదికలతో రెండు జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయసునీత హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కీలకమైన స్థూల ఉత్పత్తులకు సంబంధించి గత ఏడాది (2025-26) లక్ష్య సాధన, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) లక్ష్యాలను సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది.