Share News

నమ్మకం ఫలిస్తోంది

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:38 AM

‘గతంలో వైసీపీని భారీగా ఆదరించాం. కానీ మా ఆశలన్నింటిపై నీళ్లు చల్లారు. మరోసారి మోసపోకూడదనుకున్నాం. చంద్రబాబును, ఆయన ఇచ్చిన హామీలను నమ్మాం. ఎన్నికల్లో ఆదరించాం. చాలా త్వరగా మా ఆకాంక్షలను నెరవేర్చుతున్నారు. రెండేళ్లు తిరక్కుండానే జిల్లా వచ్చేసింది. ఈ ఏడాదిలోనే వెలిగొండ నీళ్లు అందుతాయన్న నమ్మకం కలుగుతోంది’. ఇదీ మార్కాపురం జిల్లా వాసుల మనోగతం.

నమ్మకం ఫలిస్తోంది
మార్కాపురంలోని కలెక్టర్‌ కార్యాలయం, వెలిగొండ టన్నెల్‌

జిల్లా వచ్చేసింది... వెలిగొండపై ఆశ పెరిగింది

పారిశ్రామిక ప్రగతికి బాటలు పడాలి

మార్కాపురం జిల్లా ప్రజల మనోగతం

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ఇంటింటికీ వెళ్లి తెలుగు తమ్ముళ్ల ఆహ్వానాలు

మార్కాపురంలో భారీ ఏర్పాట్లలో ఎమ్మెల్యే కందుల

ఫీడర్‌ కాలువ పనుల శంకుస్థాపన వద్ద ఎరిక్షన్‌బాబు

కనిగిరి, గిద్దలూరులో ఉగ్ర, అశోక్‌ విస్తృత పర్యటన

గతంలో వైసీపీని భారీగా ఆదరించాం. కానీ మా ఆశలన్నింటిపై నీళ్లు చల్లారు. మరోసారి మోసపోకూడదనుకున్నాం. చంద్రబాబును, ఆయన ఇచ్చిన హామీలను నమ్మాం. ఎన్నికల్లో ఆదరించాం. చాలా త్వరగా మా ఆకాంక్షలను నెరవేర్చుతున్నారు. రెండేళ్లు తిరక్కుండానే జిల్లా వచ్చేసింది. ఈ ఏడాదిలోనే వెలిగొండ నీళ్లు అందుతాయన్న నమ్మకం కలుగుతోంది’. ఇదీ మార్కాపురం జిల్లా వాసుల మనోగతం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పడింది. వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లాకు వస్తున్నారు. ఆ సందర్భంగా అక్కడి నాలుగు నియోజకవర్గాలలోని ప్రజల మనోభావాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. కొత్త జిల్లా ఏర్పడిన అనంతరం సీఎం తొలిసారి వస్తుండటంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీశ్రేణులు ఇంటింటికీ తిరిగి చంద్రబాబుకు భారీ స్వాగతం పలకాలని ప్రజలను కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

గత ఎన్నికలకు ఏడాది ముందు 2023 ఏప్రిల్‌ 19,20,21 తేదీలలో చంద్రబాబునాయుడు అప్పటి ఉమ్మడి జిల్లాలోని పశ్చిమప్రాంతంలో పర్యటించారు. తన జన్మదినమైన ఏప్రిల్‌ 20వ తేదీ మార్కాపురంలోనే ఉన్నారు. ఆరోజు అక్కడ ఆయన నిర్వహించిన రోడ్‌షోకు, సభకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆ సభలో ఆయన కూటమి ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని, వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆ మరుసటిరోజే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి సురేష్‌ ఆధ్వర్యంలో ఆపార్టీ శ్రేణులు ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రజలు ఘనస్వాగతం పలికి తమ మద్దతును తెలియజేశారు. గత ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఊహించిన దానికన్నా వేగంగా హామీల అమలుకు సీఎం శ్రీకారం పలికారు.

మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు

ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పనులు పునఃప్రారంభమయ్యాయి. అవి ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా ఏర్పాటుతో పాలన చేరువైంది. వెలిగొండ పనుల పురోగతికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తయి ఈ ఏడాదిలోనే నీళ్లు అందు తాయన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తంచేస్తున్నారు. అదే అభిప్రాయాన్ని అన్నివర్గాల వారూ బహిరంగంగానే తెలుపుతున్నారు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా సామాన్యప్రజలు కూడా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తున్నామని చెప్పడం విశేషం.

పారిశ్రామిక ప్రగతి అవసరం

ఆర్థిక వెనుకబాటుతనం పోవాలంటే సాగు, తాగునీటిని అందించడంతోపాటు పారిశ్రామిక ప్రగతికి పునాది పడాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. జిల్లా ఏర్పాటు, వెలిగొండ పనుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఏర్పడిన నమ్మకంతో ఆవిషయంలోనూ ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్న నమ్మ కాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఏర్పాట్లలో కందుల

మార్కాపురం జిల్లాను చంద్రన్న జిల్లాగా నామకరణం చేయాలని ఇటీవల అసెంబ్లీలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఇచ్చారు. వెలిగొండ జలాలూ రాబోతున్నాయి. చంద్రబాబుకు ఘనస్వాగతం ద్వారా కృతజ్ఞతలు తెలుపుదాం’ అంటూ ఆయన ఊరూరా చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మార్కాపురం నుంచి తర్లుబాడు వెళ్లే రోడ్డులో బుధవారం నిర్వహిస్తున్న సీఎం బహిరంగ సభకు ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.30 గంటలకు రానున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా 40వేల మందికి భోజన ఏర్పాట్లను నారాయణరెడ్డి చేస్తున్నారు. మార్కాపురం పట్టణం నుంచి 15వేలు, నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల నుంచి మరో 15వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. తదనుగుణంగా గ్రామస్థాయి నుంచి పార్టీశ్రేణులను సిద్ధం చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు.

శంకుస్థాపన వద్ద ఎరిక్షన్‌బాబు

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసే ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉంది. అక్కడ కార్యక్రమం జయప్రదాన్ని, నియోజకవర్గ ప్రజలను కదిలించే అంశాన్ని టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యనాయకులందరినీ ఇక్కడకు రప్పించడంతోపాటు మార్కాపురం సభకు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యేవిధంగా రెండురోజుల నుంచి రేయింబవళ్లు ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఊరు నుంచి ప్రజలు కదిలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. టీడీపీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మొత్తం కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు కనిగిరి నియోజకవర్గం నుంచి మార్కాపురం సభకు ప్రజలు తరలిరావాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో సీఎం సభకు తరలిరావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated Date - Feb 25 , 2026 | 02:38 AM