డబుల్ రిజిస్ట్రేషన్‌లతో తంటాలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 02:38 AM
ర్శి ప్రాంతంలో డబుల్ రిజిస్ట్రేషన్‌లతో స్థల వివాదాలు జటిలమవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు.
రికార్డుల ట్యాంపరింగ్‌తో ఇతరుల స్థలాలు స్వాహా
సహకరిస్తున్న కొందరు అధికారులు
దర్శి ప్రాంతంలో జటిలమవుతున్న వివాదాలు
దర్శి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : దర్శి ప్రాంతంలో డబుల్ రిజిస్ట్రేషన్‌లతో స్థల వివాదాలు జటిలమవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇతరుల ఆస్తులను స్వాహా చేస్తున్నారు. దర్శి పట్టణంలోని 50 సెంట్ల స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎన్నో సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. హక్కుదారులు ఇతర దేశాల్లో ఉంటున్నారు. కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా హక్కుదారుల వారసుల చేత అక్రమ రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న హక్కుదారులు కోర్టుకు వెళ్లి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, అక్రమార్కులు అంతటితో ఆగలేదు. మరికొంత మందిని కలుపుకొని గత ప్రభుత్వ హయాంలో అదే స్థలాన్ని అప్పటి అధికారులను లోబర్చుకొని రికార్డుల్లో ఎక్కించుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అప్పటి అధికారులు అక్రమార్కునికి ఆ స్థలాన్ని ఎలా రికార్డులో ఎక్కించారో అర్థంకావడం లేదు. ఈవిషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. అలాగే, కురిచేడు రోడ్డులో ఒక స్థలాన్ని ఎన్నో ఏళ్ల క్రితం కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అక్రమార్కులు అదే స్థలాన్ని వారసుల ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నారు. ఆ వివాదం కోర్టులో నడుస్తోంది. దర్శి ప్రాంతంలో తొలుత స్థలాల రిజిస్ట్రేషన్లు సెంట్ల లెక్కన జరిగాయి. కాలక్రమంలో విలువ పెరగడంతో గజాల్లోకి మార్చారు. గతంలో సెంట్ల లెక్కన రిజిస్ర్టేషన్లు అయిన స్థలాలు, పొలాలను అక్రమార్కులు గజాల్లో విలువ కట్టి డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దర్శిలోని అద్దంకి రోడ్డులో ఓ వ్యక్తికి సంబంధించిన సుమారు రెండెకరాల భూమిని మాజీ మిలటరీ ఉద్యోగికి ఇచ్చినట్లు కాగితాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లోకి అతని పేరును ఎక్కించారు. అసలు హక్కుదారుడు అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ గత వైసీపీ హయాంలోనే చోటుచేసుకున్నాయి.
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌లు చేస్తున్న అధికారులు
సబ్‌రిజిస్ర్టార్‌లు ఈ విషయాలను పరిశీలించకుండా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సాధారణంగా పొలాలు కానీ, స్థలాలు కానీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు రికార్డులను పరిశీలిస్తే అది ఎవరి పేరున రిజిస్ట్రేషన్ అయిందో కనిపిస్తుంది. అధికారులు ముడుపులు తీసుకొని రికార్డులను పరిశీలించకుండా నిబంధనల్లోని వెసులుబాటును అడ్డుపెట్టుకొని గజాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈవిషయాలు బయటపడేసరికి జాప్యం జరుగుతోంది. తమ స్థలాలను ఇతరులు రిజిస్టర్ చేసుకున్నారనే విషయం తెలిసిన హక్కుదారులు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు విచ్చలవిడిగా జరిగాయి. ఆ అక్రమాలన్నీ బయటకు వస్తుండటంతో నిజమైన హక్కుదారులు కోర్టులకు వెళ్లడం, లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకోవడం చేస్తున్నారు.