కనిగిరిలోనే ట్రిపుల్ ఐటీ
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:45 AM
కనిగిరి నియోజకవర్గంలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సిఫార్సు మేరకు అక్కడే ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు.
టెండర్లకు ఆదేశాలిచ్చిన మంత్రి లోకేష్
ఇటు సీఎం చంద్రబాబు , అటు లోకే్‌షతో ఎమ్మెల్యే ఉగ్ర భేటీ
వెంటనే స్పందన
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
కనిగిరి నియోజకవర్గంలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సిఫార్సు మేరకు అక్కడే ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీడీపీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ ఉగ్ర మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజర య్యారు. అక్కడ అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకే్‌షలను కలిశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించాలని గతంలో నిర్ణయించిన మేరకు కనిగిరి నియోజకవర్గంలో అనువైన స్థలం విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం కన్నా తాజా పరిస్థితుల్లో రవాణా, నీటి సౌకర్యాలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని గుర్తించామని డాక్టర్ ఉగ్ర వారి దృష్టికి తీసుకెళ్లారు. తదనుగుణంగా ఆ శాఖల ఉన్నతాధికారులు కూడా పరిశీలించి అనువైన స్థలాన్ని నిర్ధారించారని సీఎంతోపాటు లోకే్‌షకు వివరించారు. సమస్యను అర్థం చేసుకున్న వారు సంబంధిత శాఖల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని సమీక్షించారు. తదనుగుణంగా కనిగిరి నియోజకవర్గంలో డాక్టర్ ఉగ్ర సూచించిన స్థలంలోనే ట్రిపుల్ ఐటీ సొంత భవనాల నిర్మాణం సముచితమని ఆయన భావించారు. తదనుగుణంగా ఆ స్థలంలో అధికారులు రూపొందించిన అంచనాల మేరకు భవనాలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని లోకేష్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఈ విషయాన్ని డాక్టర్ ఉగ్ర మీడియాకు వివరిస్తూ కనిగిరి నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయని, మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం శరవేగంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.