రైతు సేవా కేంద్రాల వైపే మొగ్గు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:04 AM
ధాన్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో మరింత తగ్గుతుండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ కొనుగోలు చేసే కేంద్రాలలో తక్కువ ధర ఉండటంతో ఎక్కువ మంది బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు చేసేవారు.
ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతల పరుగు
బహిరంగ మార్కెట్ కంటే దాదాపు రూ.300 అదనం
వెంటనే డబ్బు చెల్లిస్తుండటంతో కర్షకుల ఆసక్తి
అద్దంకి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో మరింత తగ్గుతుండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ కొనుగోలు చేసే కేంద్రాలలో తక్కువ ధర ఉండటంతో ఎక్కువ మంది బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు చేసేవారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమం కోసం ధాన్యం రవాణా, లోడింగ్ కూలీ చెల్లించటంతోపాటు గోతాలు కూడా సరఫరా చేస్తున్నారు.
మద్దతు ధరే ఎక్కువ
బహిరంగ మార్కెట్‌లో బీపీటీ రకం ధాన్యం 75 కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.1500 వరకు ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఏ గ్రేడ్ రకం ధాన్యం 75 కిలోలు రూ.1792కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బస్తాకు సరాసరిన రూ.300 అదనంగా వస్తుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వచ్చినా రైతు భరోసా కేంద్రాలలో అమ్మకాలు చేసుకోవటం ద్వారా రూ.10 వేలు అదనంగా పొందుతున్నారు. ఇప్పటి వరకు 600 మంది రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని దాదాపు 15 వేల బస్తాలు అమ్ముకున్నారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధర పొందారు.
ప్రభుత్వం చెల్లించే అదనపు లబ్ధి
రైతు పొలం వద్ద నుంచి నేరుగా మిల్లుకు ధాన్యం తోలేందుకు రవాణా ఖర్చులు చెల్లిస్తుంది.
ధాన్యం బస్తాలకు ఎత్తే కూలీల ఖర్చు కూడా చెల్లిస్తోంది.
గోనె సంచులు కూడా సరఫరా చేస్తోంది.
చెల్లింపులు కూడా 24 గంటలలో రైతుల బ్యాంక్ ఖాతాలలో జమచేస్తోంది.
అద్దంకిలో 20 వేల ఎకరాల్లో వరి సాగు
అద్దంకి నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాలలో వరి సాగైంది. నెల రోజుల నుంచి నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. ఎక్కువమంది రైతులు ఆలస్యంగా నాట్లు వేసినందున ప్రస్తుతం నూర్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు.. తాము పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి అధికారుల చేత ఆమోదముద్ర వేయించాలి. ఆ తర్వాత మిల్లర్ల వద్ద ధాన్యాన్ని అమ్ముకోవాలి. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుచేసే మిల్లర్లు అద్దంకిలో ఒకటి, మేదరమెట్లలో ఒకటి, పంగులూరు మండలం కశ్యాపురం వద్ద ఒకటి మా త్రమే ఉన్నాయి. దీంతో బల్లికురవ, సంతమాగులూరు మండలాల రైతులు కూడా ఈ మూడు రైస్‌మిల్లులకే ఽధాన్యం తరలించాల్సి వస్తుంది. దీంతో మిల్లుల వద్ద కొనుగోళ్లు ఒకింత ఆలస్యం అవుతున్నాయి. కూలీలను మరింత ఎక్కువ మందిని ఏర్పాటుచేసి వేగవంతంగా కొనుగోళ్లు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.