Share News

మైనింగ్‌ శాఖలో వణుకు

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:17 AM

భూగర్భ గనుల శాఖలో సీబీఐ వణుకు పుట్టించింది. మంగళవారం నాటి దాడుల ప్రభావం ఆయా కార్యాలయాల్లో బుధవారం కూడా కనిపించింది. వరుసగా ఏసీబీ, సీబీఐ దాడులతో జిల్లాలోని మైనింగ్‌ శాఖలో కలకలం మొదలైంది.

మైనింగ్‌ శాఖలో వణుకు

సీబీఐ దాడితో అప్రమత్తమైన అధికారులు

రావద్దంటూ దళారులకు హెచ్చరిక

ఒంగోలు క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): భూగర్భ గనుల శాఖలో సీబీఐ వణుకు పుట్టించింది. మంగళవారం నాటి దాడుల ప్రభావం ఆయా కార్యాలయాల్లో బుధవారం కూడా కనిపించింది. వరుసగా ఏసీబీ, సీబీఐ దాడులతో జిల్లాలోని మైనింగ్‌ శాఖలో కలకలం మొదలైంది. నాలుగు నెలల క్రితం ఒంగోలు మైనింగ్‌ శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీలలో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా మంగళవారం గ్రానైట్‌ క్వారీలు తనిఖీ చేయడానికి హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వచ్చిన మైనింగ్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌ శివశంకర్‌ను సీబీఐ మెరుపు దాడి చేసి పట్టుకుంది. గ్రానైట్‌ క్వారీ యజమానుల నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయం వెలవెలబోయింది. పనుల మీద వచ్చే వారితోపాటు అధికారులు, ఉద్యోగులు మంగళవారమంతా కనిపించలేదు. కొన్ని ఫైళ్లను సిబ్బంది ఇళ్లకు తీసుకెళ్లి చక్కదిద్దుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్‌ క్యారీలలో లీజుల నుంచి అనుమతుల వరకు చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుకునే పనిలో పడ్డారని సమాచారం. అంతేకాకుండా గ్రావెల్‌ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు, అక్రమాలకు పాల్పడిన వారి వద్ద నుంచి వసూలు చేసిన జరిమానాలు వంటి వాటి విషయాలలో జరిగిన మతలబులు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇన్నాళ్లూ ఏం చేసినా మాకు ఎదురే లేదు.. అడిగేవారే లేరన్నట్లు వ్యవహరించే యంత్రాంగం ఇప్పుడు అప్రత్తమైంది. నిత్యం పైరవీలు చేసే మధ్యవర్తులను సైతం కార్యాలయాలకు రావద్దని అధికారులు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. సీబీఐ మెరుపు దాడి కారణంగా మైనింగ్‌ శాఖతోపాటుగా గ్రానైట్‌ వ్యాపారులలో కలవరం నెలకొంది. లంచం ఇస్తున్న ఇరువురిని అరెస్టు చేయడంతో వ్యాపార వర్గాలు సైతం ఆలోచనలో పడ్డాయి. మంగళవారం నుంచి గ్రానైట్‌ రంగంలో ఎక్కడచూసినా ఇదే చర్చ నడుస్తోంది.

Updated Date - Aug 20 , 2026 | 02:17 AM