Share News

పారదర్శకంగా పాస్‌పపుస్తకాలు

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:49 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల భూములకు సంబంధించిన పాస్‌పుస్తకాలను అత్యంత పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో అందజేస్తు న్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

పారదర్శకంగా పాస్‌పపుస్తకాలు
రైతుకు పాస్‌ పుస్తకం అందజేస్తున్న మంత్రి స్వామి, జేసీ కల్పనాకుమారి

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ శ్రీబాలవీరాంజనేయస్వామి

పాలేటిపాడు (కొండపి), ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల భూములకు సంబంధించిన పాస్‌పుస్తకాలను అత్యంత పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో అందజేస్తు న్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. జరుగుమల్లి మండలం పాలేటిపాడులో 879 మందికి, అదే రెవె న్యూలోని మోచర్ల వారి కండ్రిగ 139మంది రైతులకు జేసీ కల్పనాకుమారితో కలిసి మంత్రి శుక్రవారం పాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో రైతుల పాస్‌పుస్తకాలు, హద్దురాళ్లపై జగన్‌ తన బొమ్మలు వేసుకున్నాడని గుర్తుచేశారు. తాతలు, తండ్రుల నుంచి వస్తున్న భూములు, కష్టపడి సంపాదించుకుని కొనుగోలు చేసుకున్న రైతుల భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మలు వేసుకోవడం దారుణమన్నారు. అందుకే ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం జగన్‌కు చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజము ద్రతో తగిన భద్రతా ప్రమాణాలతో, క్యూఆర్‌ కోడ్‌ ఇచ్చి పాస్‌ పుస్తకాలను అందజేస్తున్నదన్నారు. ఇతర ప్రాంతాల్లో నివసించే వారు, వారి వారసులు కూడా తమ భూములను సొంత ఊళ్లకు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకునే విధంగా ప్రభుత్వం పాస్‌ పుస్తకాలు తయారు చేసిందన్నారు. ఏఐ, ఇతర ఆధునిక సాంకేతికత ఆధారంగా తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పారు. వీలైనంత త్వరగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న చుక్కలు, గర్భకండ్రిగలు, గయ్యాళి భూముల సమస్యలు కూడా పరిష్కారమవుతాయన్నారు. జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ రీసర్వే పారదర్శకంగా, రైతులతో చర్చించి వారి సమక్షంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, కామేపల్లి పోలేరమ్మ ఆలయ చైర్మన్‌ పోటు శ్రీనివాసమురళి, వీఆర్వో రాకేష్‌, మక్కెన శ్రీనివాసరావు, నిడమలూరి వెంకటప్పయ్య, కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 02:49 AM