Share News

పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:15 PM

స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పీ రాజాబాబు ఆదేశించారు.

పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌రాజాబాబు

అధికారులు సంసిద్ధులు కావాలని కలెక్టర్‌ ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌,ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పీ రాజాబాబు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లతో మంగళవారం స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ సమావేశపుహాలులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 514 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, వాటిల్లో 5,847 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఆయా పంచాయతీల్లో 10,70,670 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునర్విభజనతో ఏర్పడిన నూతన డివిజన్లు, వార్డుల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై ప్రజలకు వివరించడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని లిఖితపూర్వకంగా దస్త్రాల్లో పొందుపర్చాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను నియమించడంతో పాటు కోర్టు కేసులు ఉన్నవాటిని మినహాయించి మిగిలిన వాటిల్లో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా డీలిమిటేషన్‌ ద్వారా 62 డివిజన్ల ఏర్పాటుకు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు అదనంగా బ్యాలెట్‌ బాక్సులను సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్వోలు, ఏఆర్వోలను నియమించడంతోపాటు వచ్చే నెల 3న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. కందుకూరు, అద్దంకి, చీమకుర్తి మునిసిపాలిటీల్లో కూడా వార్డులు పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు ఎం. అనుపమ, బాలమ్మ, కమీషనర్లు వెంకట కృష్ణయ్య, అర్జున్‌రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:15 PM