ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బదిలీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:23 AM
గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఒంగోలు సర్కిల్ ఎస్ఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆశాఖ ఒంగోలు డివిజన్ ఈఈగా ఉన్న నాగేశ్వరరావు దాదాపు ఏడాది కాలంగా ఇన్చార్జి ఎస్ఈ బాఽధ్యతల్లో కొనసాగుతున్నారు.
నెల్లూరు ఎస్ఈకి ఇక్కడ తాత్కాలిక బాధ్యతలు
సీఎం జిల్లా పర్యటనలో ఆ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి
ఒంగోలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఒంగోలు సర్కిల్ ఎస్ఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆశాఖ ఒంగోలు డివిజన్ ఈఈగా ఉన్న నాగేశ్వరరావు దాదాపు ఏడాది కాలంగా ఇన్చార్జి ఎస్ఈ బాఽధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై పలువురు ఉద్యోగులు, కొందరు కాంట్రాక్టర్లు కూడా ఇటు ఉన్నతాధికా రులు, కీలక ప్రజాప్రతినిధులకు గతంలో ఫిర్యాదులు చేశారు. కొంత వివాదాస్పదంగా ఆయన పనితీరు సాగినట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ ఉంది. కాగా ఈనెల 10న కొండపి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు నర్సింగోలులో నిర్వహించిన ప్రజావేదిక సభలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్, ఇతర రూపాలలో సర్వే చేస్తున్న విషయం విదితమే. ఆ సర్వే ఆధారంగా జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్, మెప్మా, ఆర్టీసీ, డీఆర్డీఏ, స్త్రీ,శిశుసంక్షేమశాఖ, సచివాలయాలు, ఇతరత్రా పలు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ తీరుపై వచ్చిన సర్వే వివరాలను తెలియజేస్తూ సీరియస్ అయ్యారు. మరోవైపు ఇన్చార్జి ఎస్ఈ నాగేశ్వరరావు వ్యవహారశైలిని జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం నాగేశ్వరరావును ఇక్కడి నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. తదనుగుణంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఈఎన్సీ గాయత్రీదేవి చర్యలు తీసుకున్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ నెల్లూరు సర్కిల్ ఎస్ఈగా పనిచేస్తున్న జి.విజయభాస్కర్కు ఒంగోలు సర్కిల్ ఎస్ఈ బాధ్యతలను అప్పగించారు. మరో అధికారి నియామకం జరిగే వరకు విజయభాస్కర్ ఇక్కడ బాధ్యతలు చూడనున్నారు. అలాగే ఒంగోలు ఈఈగా కూడా నాగేశ్వరరావు ఉండటంతో ప్రస్తుతం ఆశాఖ ఒంగోలు డీఈగా పనిచేస్తున్న కె.రామ్మోహన్రావుకు ఇన్చార్జి ఈఈ బాధ్యతలు అప్పగించారు.