ప్రకాశం జిల్లాలో విషాదం
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:18 PM
ప్రకాశం జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
మోపెడ్‌ను ఢీకొన్న బొలెరో.. తల్లీ కొడుకులు మృతి
మేదరమెట్ల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): స్వగ్రా మం నుంచి మోపెడ్‌పై అద్దంకి వెళుతుండగా కారు ఢీకొనడంతో తల్లీకుమారులు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే... కొరిశపాడు మండలం పి.గుడిపాడుకు చెందిన తాడి వెంకయ్య(55) అద్దంకి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ్ముడు వద్ద ఉన్న తల్లి మహాలక్ష్మి(78)ని తను ఉంటున్న అద్దంకిలోని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో సొంతూరు వద్ద జాతీయరహదాని దాటే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీరంగం వెళుతున్న బొలెరో మోపెడ్‌ను ఢీకొట్టింది. దీంతో తల్లికుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందిన మహలక్ష్మికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భార్య ఆదిలక్ష్మి గుడిపాడు సర్పంచ్‌గా ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్సై అహ్మద్ పరిశీలించి కేసు నమోదు చేశారు.
సాగర్ కాలువలో పడి బీటెక్ విద్యార్థి మృతి
పుల్లలచెరువు, జనవరి16(ఆంధ్రజ్యోతి):నాగార్జున సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం చో టుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్ర కారం మండలంలోని ఐటీవరం గ్రామానికి చెందిన మారాసు బలరాం పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎన్‌ఈసీ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో తన స్నేహితుడి బైకు తీసుకొని ఇంటికి వచ్చి భైకుపై తన పొలానికి వెళ్లాడు. మార్గ మధ్యంలో సాగర్ కాలువ ఉండటంతో బహిర్భూమికి వెళ్లేందుకు నీటికోసం కాలువలోకి దిగాడు. కాంక్రీటుపై పాచి ఉండటంతో పట్టు తప్పి కాలువలో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి కాలువలో వెతకగా శుక్రవారం ఉదయం 11 గంటలకు మృతుదేహం నీటిలో నుంచి పైకి తేలింది పోలీసులకు సమాచారం అందటంతో ఎస్‌ఐ సంపత్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
చెరువులో పడవ బోల్తా.. యువకుడు మృతి
కంభం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : కంభం చెరువులో పడవపై చేపలు వేటకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వలతో సహా చెరువులో పడి మరణించిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. కంభం ఎస్సై శివారెడ్డి కథనం ప్రకారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన వాయుల శేషయ్య (25) జీవనోపాధి కోసం కంభం మండలం నల్లకాల్వ గ్రామంలో నివశిస్తూ చేపలు పడుతుండేవాడు. గురువారం రాత్రి పడవపై చేపల వేటకు వెళ్లాడు. చీకట్లో పడవ చెరువు కట్ట సమీపంలో ఉన్న ఒక చెట్టు మొద్దుకు తగిలి పడవ బోల్తా పడడంతో వలతోపాటు చెరువులో పడి మరణించాడు. మృతుని తుండ్రి కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రాష్ట్ర టీడీపీ సెల్ ప్రధాన కార్యదర్శి మైనార్టీ మృతి
ఒంగోలు క్రైం, జనవరి 16(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమద్ జాఫర్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో జాఫర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నెల్లూరుకు చెందిన మహమద్ జాఫర్ శుక్రవారం విజయవాడ నుంచి నెల్లూరు కారులో వెళుతూ మార్గమధ్యలో కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం వద్ద ప్రమాదానికి గురైయ్యారు. మంచు కారణంగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కనిపించకపోవడంతో కారు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ గాయపడగా, జాఫర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి వారిని ఒంగోలు కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జాఫర్ చనిపోయాడు. జాఫర్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ జాఫర్ మరణం అత్యంత బాధాకరమని, ఆయన అకాల మరణం తనను కలచివేసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి జాఫర్ కృషి మరువలేనిదని, కార్యకర్తలను సమన్యయం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాఫర్ కుటుంబానికి అండగా ఉంటానని వివరించారు.
రోడ్డుప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి
ముండ్లమూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెడ్డినగర్ వద్ద శుక్రవారంరాత్రి ఎదురెదురుగా మోటారుసైకిళ్లు ఢీకొని పల్నాడు జిల్లా ముప్పరాజువారిపాలేనికి చెందిన ఉప్పుటూరి ప్రసన్నకుమార్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. మరో బైకుపై ప్రయాణిస్తున్న దర్శి మండలం తూర్పుచవటపాలేనికి చెందిన నాగులూరి ఏసుబాబుకు తీవ్ర గాయాలపాలై ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మృతుడు ప్రసన్నకుమార్ తన అమ్మమ్మ ఊరైన కెల్లంపల్లికి శుక్రవారం ఉదయం వచ్చాడు. సాయంత్రం తన స్నేహితుడైన కెల్లంపల్లి గ్రామానికి చెందిన సుంకర రామకోటిరెడ్డితో బైక్‌పై దర్శికి బయలుదేరారు. అదే సమయంలో రెడ్డినగర్ సమీపంలో ఏసుబాబు బైక్‌పై ఎదురెదురుగా రావడంతో ఢీకొన్నారు. వాహనం నడుపుతున్న ప్రసన్న కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రామకోటిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రసన్న కుమార్ మూడేళ్ల క్రితం ఫిలిపైన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదువుతూ అక్కడినుంచి నాల్గవ సంవత్సరం ఇటీవలే హైదరాబాద్‌లో చేరారు. ఘటనా స్థలాన్ని ముండ్లమూరు ఏఎ్‌సఐ హనుమంతరావు పరిశీలించి మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఏసుబాబు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.