పట్టణంలో రహదారిపై నిలిచిన ట్రాఫిక్
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:03 AM
చీరాల పట్టణం, పేరాల ప్రధాన రహదారులు అడుగడుగున ఆక్రమణలకు గురవుతున్నాయి.
చీరాల, ఫిబ్రవరి6 (ఆంధ్రజ్యోతి) : చీరాల పట్టణం, పేరాల ప్రధాన రహదారులు అడుగడుగున ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇళ్లు, దుకాణాల ర్యాంపులు, మెట్లు సైతం రోడ్డుపై నిర్మిస్తున్నారు. దుకాణాల పైభాగంలో నిర్మించే రేకులు కూడా రోడ్డుపైకి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు ఇరుకు సందుల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో ఎదురెదురు వాహనాలతో నిత్యం ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయి. మరి ముఖ్యంగా చీరాల పట్టణంలోని పలు వ్యాపారాలకు సంబంధించిన వాహనాలు సమయపాలన లేకుండా సరుకు ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. ఈ సమయంలో రోడ్లు మరింత రద్దీగా ఉంటున్నాయి. దీంతో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ స్తంభించి వాహన చోదకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
అన్నీ ఇరుకు సందులే...
చీరాల, పేరాల ప్రాంతాల్లో దాదాపుగా రోడ్డుకు రెండు వైపులా దుకాణాలే. ఈక్రమంలో ఆయా దుకాణాల వద్ద వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చిన వాహనదారులు రోడ్డుపై వాహనాలను ఉంచు తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు ఇరుకుగా మారుతుం డడంతో చీరాల నుంచి రాకపోకలు సాగించే వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. ముఖ్యగా పేరాల మసీదు సెంటర్‌లో రోడ్డుపైకి చేరిన కూరగాయల మార్కెట్ మరియు చేపల మార్కెట్‌తో ప్రయాణానికి ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాడికాయ పడినట్లు అదేసమయంలో సమీపాన ఉన్న కారంచేడు రైలు గేటు నిత్యం రైళ్ల రాకపోకలు కారణంగా గేటు పడుతుంటుంది. ఈ సమయంలో వాహనదారులు బతుకుజీవుడా అంటూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తల పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రెండు వైపుల రోడ్లుకు మధ్య పట్టణంలో పలు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు డివైడర్‌లు ఉంచారు. ఈ కారణంగా గడియారస్తంభం కూడలిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు రోడ్డు నడిమఽధ్యలో ఉంచి కొనుగోళ్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు సాయంత్రం పదుల సంఖ్యలో ఇతర రాష్ర్టాలకు చెందిన కార్లు సైతం నడిరోడ్డుపై పార్క్ చేస్తున్నారు. చీరాల చుట్టు ప్రక్కల పారంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో అన్ని రకాల వాహనాలు వస్తుం టాయి. ఈ సమయంలో పోలీసులు ట్రాఫిక్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించకుంటే ప్రజల సమస్యల పరిష్కారం జరిగేమాట కల్లే అనుకోవాలి. మరోవైపు ప్రమాదాలు కూడా లెక్కల్లో వేసుకుంటూ ఉండటమేనని పట్టణ ప్రజలు అంటున్నారు.