Share News

సైబర్‌ ఉచ్చులో వ్యాపారులు

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:31 PM

ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్‌ సెంటర్‌, త్రిపురాంతకం రోడ్డులోని ఇద్దరు వ్యాపారులు ఈ నెల 7వ తేదీన సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. ఆ వ్యాపారులకు కేటుగాళ్లు టోకరా వేశారు.

సైబర్‌ ఉచ్చులో వ్యాపారులు
టోల్‌గేట్‌ వద్ద గుర్తించిన కారు ఇదే, నగదు బదిలీ చేసిన వ్యక్తి

ఫోన్‌ పేతో నగదు బదిలీ

ఒకరికి రూ.25వేలు, మరొకరికి రూ.70వేలు టోకరా

వైపాలెంలో ఘటన - పోలీసులకు ఫిర్యాదు

ఎర్రగొండపాలెం రూరల్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరగాళ్ల (డిజిటల్‌ మోసం) ఉచ్చులో తరచూ ఏదో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్‌ ఉచ్చులో పడవద్దని ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అప్రమత్తం చేస్తున్నా వారి మాయలో పడుతూనే ఉన్నారు.

ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్‌ సెంటర్‌, త్రిపురాంతకం రోడ్డులోని ఇద్దరు వ్యాపారులు ఈ నెల 7వ తేదీన సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. ఆ వ్యాపారులకు కేటుగాళ్లు టోకరా వేశారు. వివరాలకు వెళితే..

అంబేడ్కర్‌ సెంటరులోని ప్రభుత్వ పంచాయతీ కాంప్లెక్స్‌లోని నటుకుల సూపర్‌ మర్చెంట్‌ దుకాణం వద్దకు ఇద్దరు కారులో వచ్చి పలు రకాల వంట సామగ్రి కావాలని నమ్మబలికారు. కొనుగోలు చేసి ఫోన్‌ పే స్కానర్‌ పని చేయడం లేదని, ఫోన్‌ పే నెంబర్‌ చెప్పాలనడంతో ఆ వ్యాపారి హోల్‌సేల్‌ మార్కాపురం వ్యాపారి నెంబరు ఇచ్చారు. కేటుగాళ్లు ఆ నెంబర్‌కి రూ.25వేలు నగదు పంపించినట్లు చూపించారు. వ్యాపారంలో నిమగ్నమైన బాధితుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు మరుసటి రోజు మార్కాపురం వ్యాపారి వచ్చి బిల్లు చెల్లించాలని ఆడగడంతో కంగుతిన్నాడు. జరిగిన విషయమై చర్చించి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే త్రిపురాంతకం రోడ్డులోని కాంప్లెక్స్‌లో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసే వ్యక్తి దగ్గరకు రూ.70వేలు నగదును (ఫోన్‌ నెం 9966394644) ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ నగదు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు సక్సస్‌ అయినట్లు రావడంతో రూ.70వేలు నగదు చెల్లించారు. అరగంట తర్వాత నగదు కనిపించకపోవడంతో బాధితుడు ఎలిశెట్టి ఆదినారాయణ ఈ నెల 8న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే కుంట (హనుమాన్‌ జంక్షన్‌)లో, మాచర్లలో ఇదే తరహాలో రూ.25వేల చొప్పున నగదు మోసం జరిగినట్లు తెలిసింది. ఈ విషయాలపై ఎస్‌ఐ చౌడయ్యను వివరణ అడగగా ఫిర్యాదులు వచ్చాయని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 11:31 PM