Share News

పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు మహిళా కూలీల మృతి

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:50 AM

పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన ఘటన మండలంలోని గంగపాలెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది.

పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తా..  ఇద్దరు మహిళా కూలీల మృతి
బోల్తా పడిన ట్రాక్టర్‌ ట్రక్కు

గంగపాలెం సమీపంలో ఘటన

మృతులిద్దరూ అదే గ్రామంలోని ఆదిఆంధ్ర కాలనీవాసులు

లింగసముద్రం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : పచ్చాకు ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన ఘటన మండలంలోని గంగపాలెం గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన పచ్చాకు కూలీలు స్వర్ణ సలోమి(38), పట్టపు రత్తమ్మ(45)తోపాటు మరో నలుగురు కలిసి శనివారం తెల్లవారుజామున పచ్చాకు కొట్టేందుకు స్థానిక రైతుకు చెందిన ట్రాక్టర్‌లో పొలం వెళ్లారు. ఆకు రెలిచిన అనంతరం పచ్చాకును ట్రాక్టరులో నింపుకొని దాని డోర్లపై కూర్చొని మహిళా కూలీలు బయల్దేరారు. గ్రామ సమీపానికి ట్రాక్టరు వచ్చిన సమయంలో టైరు మట్టి రోడ్డు గుంతలోకి దిగడంతో ట్రక్కు ఒక పక్కకు తిరగబడింది. దీంతో ఆ వైపు కూర్చొన్న సలోమి, రత్తమ్మపై ట్రక్కు, పచ్చాకు మొత్తం పడిపోయింది. రెండోవైపున ఉన్న మహిళలు పక్కకు దూకేశారు. స్థానికులు గమనించి వెంటనే ఎక్స్‌కవేటర్‌ తెప్పించి ట్రక్కును, పచ్చాకును తొలగించారు. అనంతరం మహిళలిద్దరినీ బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.రాంబాబు ఇద్దరి మృతదేహాలను 108 వాహనంలో పోస్ట్‌మార్టం నిమిత్తం కందుకూరులోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో ఆదిఆంధ్ర కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - Feb 15 , 2026 | 02:50 AM