పతనం దిశగా..
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:51 AM
ఈ సీజన్లో పొగాకు వేలం ప్రారంభించి ఏడు మాసాలు గడిచినా మార్కెట్ గాడిలో పడలేదు. ధరలు ఇంకా పతనం దిశగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు పండిన పంటలో 70శాతం మాత్రమే కొనుగోలైంది. ఇంకా 30శాతం రైతుల వద్దనే ఉంది.
పొగాకు మార్కెట్లో మళ్లీ దిగజారుతున్న ధరలు
కిలో రూ.20పైన తగ్గిన సగటు ధర
బ్రౌన్ రకం కన్నా మేలురకం రేట్లలో భారీగా తగ్గుదల
దక్షిణాదిలో ఇంకా రైతుల వద్దనే సుమారు 30 శాతం పంట
మార్కెట్ ఇలాగే కొనసాగితే భారీగా నష్టపోయే అవకాశం
ఒంగోలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఈ సీజన్లో పొగాకు వేలం ప్రారంభించి ఏడు మాసాలు గడిచినా మార్కెట్ గాడిలో పడలేదు. ధరలు ఇంకా పతనం దిశగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకు పండిన పంటలో 70శాతం మాత్రమే కొనుగోలైంది. ఇంకా 30శాతం రైతుల వద్దనే ఉంది. ఈ సమయంలో మెరుగైన ధరలు లభించాల్సి ఉండగా అందుకు భిన్నంగా రోజురోజుకూ దిగజారుతున్నాయి. అంతకుమించి లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ (ఎఫ్-5) రకం గ్రేడ్ కన్నా మేలురకంగా పిలిచే(ఎఫ్-2) రకం ధర గణనీయంగా పడిపోయింది. పక్షం రోజులుగా మార్కెట్లో ఈ పరిస్థితి రోజురోజుకూ పెరుగుతుండగా సగటు ధరలు కిలోకు రూ.20పైగా తగ్గిపోయాయి. దక్షిణాది పొగాకు మార్కెట్ మరోసారి పతనం దిశగా నడుస్తోంది. ప్రస్తుతం 2025-26లో ఉత్పత్తి అయిన పంట కొనుగోలు కొనసాగుతోంది. ఈ సీజన్‌కు దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో 92.50 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా సుమారు 142 మిలియన్ కిలోలు పండినట్లు అంచనా. ఈ ఏడాది మార్చి 25న వేలం ప్రారంభిం చగా ఇప్పటి వరకూ సుమారు 101 మిలియన్ కిలోల పంటను వ్యాపారులు కొనుగోలు చేశారు. సగటున కిలోకు రూ.193 లభించింది. నిజానికి గత ఏడాది, అంతకు ముందు ఏడాది సగటు ధరలతో పోల్చితే వరుసగా కిలోకు సుమారు రూ.30, రూ.70 తక్కువగా ఉంది. ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా అధిక దిగుబడి, విదేశాలలో నాణ్యమైన పంట ఉత్పత్తి, అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలు, సిగరెట్ ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ పెంపు తదితర కారణాలను చూపుతూ వ్యాపారులు ధరలు తగ్గించి వేశారు.
గరిష్ఠ ధరలపై సీలింగ్
గత రెండేళ్లు గరిష్ఠ ధర కిలో రూ.300 నుంచి రూ.350 వరకు కొనసాగగా ఈ ఏడాది వ్యాపారులు కిలో రూ.250పై సీలింగ్ పెట్టి కొంటున్నారు. దీనిపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు, ప్రభుత్వ జోక్యంతో మార్కెట్ కొంత కుదుటపడి రెండు నెలలుగా కాస్తంత సజావుగా సాగుతోంది. కిలో గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.110గా ప్రభుత్వం సూచించింది. అలాగే సగటు ధర కిలో రూ.200కు తగ్గకుండా కొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో మేలురకంగా పిలిచే ఎఫ్-1, ఎఫ్-2 కిలో రూ.200 నుంచి రూ.250 వరకు, మీడియంలో రూ.180 నుంచి రూ.220, అలాగే లోగ్రేడ్‌లో నాణ్యమైన గ్రేడ్లను కిలో రూ.150 నుంచి రూ.190 వరకు కొనుగోలు చేస్తున్నారు. దాని వల్ల సగటు ధర కిలో రూ.200 లభించకపోయినా మార్కెట్లో రోజువారీ నోబిడ్లు తగ్గి ఆందోళనలు లేకుండా సాగింది. కానీ పక్షం రోజుల నుంచి మళ్లీ పతనం దిశగా వెళ్తోంది.
మళ్లీ పెరుగుతున్న నోబిడ్లు
వ్యాపారులు మేలు రకంలో లెక్కకు పది బేళ్లకు కిలో రూ.240 నుంచి రూ.250 ధర ఇచ్చి మిగతా వాటిని రూ.200కు కూడా కొనడం లేదు. అంతేకాక ఎఫ్-2 రకం బేళ్లలో ఎక్కడన్నా కాస్తంత తెలుపు ఆకు కనిపిస్తే సెలైన రకం అంటూ కిలో రూ.150కి దిగజారుస్తున్నారు. దీనివల్ల గతం కన్నా నోబిడ్లు మళ్లీ పెరుగుతున్నాయి. అదే సమయంలో లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్(ఎఫ్-5) రకం బేళ్లను గతంలో కిలో రూ.150కి అటుఇటుగా కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.220 వరకూ ఇస్తున్నారు. ఇక మేలురకం బేళ్లకు ఏదో ఒక వంక చూపి ధరలు తగ్గించి తమకు అవసరమైన బ్రౌన్ రకం బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సగటు ధరలు భారీగా తగ్గిపోతున్నాయి.
పక్షంలో రూ.20 తగ్గిన ధర
దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలలో ఈనెల 14న కిలో సగటు ధర రూ.198.75 లభించగా ఈనెల 27న రూ.178.19కి తగ్గిపోయింది. అలా పక్షంరోజులలో కిలోకు రూ.20పైగా సగటు ధరలు పడిపోయాయి. అంతేకాక నోబిడ్ బేళ్లు కూడా భారీగా పెరిగాయి. ఈనెల 14న నోబిడ్లు సగటున 8.16శాతంగా ఉండగా 27వతేదీ నాటికి 16.30శాతానికి పెరిగాయి. దక్షిణాదిలో రెండు రీజియన్లు ఉండగా రీజియన్ల వారీ చూస్తే ఈనెల 14న ఎస్బీఎస్ రీజియన్‌లో 0.52 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటు ధర కిలో రూ.200.43 లభించింది. నోబిడ్లు 7.44శాతంగా ఉన్నాయి. ఆ రీజియన్‌లో ఈనెల 27న 0.55 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరగ్గా సగటు ధర కిలో రూ.186.06కు తగ్గడంతోపాటు నోబిడ్లు 16.82 శాతానికి పెరిగాయి. ఎస్ఎల్ఎస్ రీజియన్‌లో పరిశీలిస్తే 14న కిలో సగటున రూ.197.10 ధరతో 0.54 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా 8.88 నోబిడ్లు ఉన్నాయి. అదే 27న చూస్తే 0.50 మిలియన్ కిలోలు కొనుగోలు జరగ్గా సగటు ధర కిలో రూ.170.22కు దిగజారింది. నోబిడ్లు 15.79శాతానికి పెరిగాయి. మార్కెట్ ఇలాగే కొనసాగితే మొత్తం కొనుగోళ్లు పూర్తయ్యేసరికి సగటు ధర కిలో రూ.150కి దిగజారి తీవ్రంగా నష్టపోతామని రైతులు అందోళన చెందుతున్నారు.