ఉమ్మడిగానేనా?
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:39 AM
జిల్లాలో సహకార ఎన్నికలపై స్పష్టత కరువైంది. 14 ఏళ్ల తరువాత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వరకు ప్రత్యేకంగా సహకార శాఖ విభజన చేపట్టి నిర్వహిస్తారా? లేక ఉమ్మడిగానే రెండు జిల్లాలకు కలిపి ఎన్నికలుంటాయా? అన్న విషయం ఇంకా తేలలేదు.
విభజన పూర్తికాని సహకార శాఖ
జనవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం
మార్కాపురం జిల్లాలో సిబ్బంది, కార్యాలయం లేదు!
డీసీసీబీ ఎన్నికపై స్పష్టత కరువు
మార్కాపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సహకార ఎన్నికలపై స్పష్టత కరువైంది. 14 ఏళ్ల తరువాత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వరకు ప్రత్యేకంగా సహకార శాఖ విభజన చేపట్టి నిర్వహిస్తారా? లేక ఉమ్మడిగానే రెండు జిల్లాలకు కలిపి ఎన్నికలుంటాయా? అన్న విషయం ఇంకా తేలలేదు. ఇప్పటికీ ఆశాఖ పర్యవేక్షణ అంతా ప్రకాశం జిల్లా నుంచే జరుగుతుండగా ఇటీవల మార్కాపురానికి ఒక జిల్లా అధికారిని నియమించారు. కానీ జీతభత్యాలన్నీ ప్రకాశం నుంచే చెల్లిస్తున్నారు. కేవలం పాలనా వ్యవహారాలను మాత్రమే మార్కాపురంలో అధికారి చూస్తున్నారు. ఇప్పటివరకు ఒంగోలు సబ్ డివిజన్‌లో ఉన్న పొదిలి, కనిగిరి పరిధిలోని 13 సహకార సంఘాలను మార్కాపురంలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం సహకార డివిజన్ పరిధిలో 23 సొసైటీలు ఉన్నాయి. దీంతో జిల్లాలో సహకార సంఘాల సంఖ్య 36కు చేరింది. ఇప్పటికే సహకార ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలు, వార్డుల విభజన, రిజర్వేషన్‌ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సూచనలు అందాయి. ఈనేపథ్యంలో కొత్త జిల్లా పరిధిలో ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతాయా? లేక ఉమ్మడిగానే ఉంటాయా? అన్న దానిపై స్పష్టత లేదు. నూతన జిల్లాలో జడ్పీ ఏర్పడటంతో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలతో జడ్పీకి కొత్త చైర్మన్, పాలకవర్గంతో పాలన ప్రారంభం కాబోతోంది. అదేతరహాలో జిల్లాలో కొత్తగా డీసీసీబీ (జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఏర్పడితే కొత్తవారికి పదవులు దక్కుతాయని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా శాఖాపరంగా నిర్ణయం వెలువడ లేదు. ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తప్ప ఏప్రాతిపదికన నిర్వహిస్తారన్నది ఇంకా తేలలేదని అధికారులు చెప్తున్నారు.