Share News

నేడే ఆఖరు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:03 AM

పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి ఆ ప్రజాప్రతినిధులంతా మాజీలు కానున్నారు. అదేరోజు నుంచి ఈ సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి.

నేడే ఆఖరు

ఇక మునిసిపల్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్లు అంతా మాజీలే

ముగియనున్న పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

ఇప్పటికే నియమించిన ప్రభుత్వం

ఒంగోలు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి ఆ ప్రజాప్రతినిధులంతా మాజీలు కానున్నారు. అదేరోజు నుంచి ఈ సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పట్టణ స్థాయి సంస్థలకు స్పెషల్‌ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో 2021 మార్చి 10న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పటికి జిల్లాల విభజన చేపట్టలేదు. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు చీరాల, మార్కాపురం మునిసిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగరపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా వాటన్నింటిలోనూ నాడు అధికారంలో ఉన్న వైసీపీ పక్షం వారే గెలుపొందారు. అప్పుడు ముని సిపాలిటీగా ఉన్న కందుకూరుకు కోర్టు వివాదంతో ఎన్నిక నిలిచిపోయింది. అనంతరం దర్శి, పొదిలి నగరపంచాయతీలు ఏర్పాటయ్యాయి. దర్శికి ఎన్ని కలు జరగ్గా అనూహ్యంగా టీడీపీ గెలుపొందింది. పొదిలికి ఎన్నికలు నిర్వహించలేదు.

ఇక నుంచి ‘స్పెషల్‌’ పాలన

2021 మార్చి 10న ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలకు ఏర్పడిన పాలక మండళ్ల పదవీకాలం మంగళవారంతో ముగుస్తోంది. అలా ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌, కార్పొరేటర్లు, అద్దంకి, చీమకుర్తి నగరపంచాయతీలోని చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిల చైర్మన్లు, కౌన్సిలందరికీ పదవీకాలం ముగిసి మాజీలు అవుతున్నారు. ఇక దర్శి పాలకవర్గానికి మరో రెండేళ్లు పదవీకాలం ఉండటంతో వారు కొనసాగనున్నారు. ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈనెల 8నుంచి వాటిలో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన ప్రారంభంకానుంది. ఒంగోలు కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ రాజాబాబు, చీమకుర్తికి ఒంగోలు ఆర్డీవో, అద్దంకి, మార్కాపురం, కనిగిరిలకు అక్కడి ఆర్డీవోలు, గిద్దలూరుకు వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌డీసీని ప్రత్యేకాధురులుగా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. వారంతా ఈనెల 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి నుంచి ఆరు మాసాల వరకు లేదా ఈలోపు ఎన్నికలు జరిగితే అప్పటివరకు స్పెషలాఫీసర్ల ఆధ్వర్యంలోనే పాలన సాగనుంది. ఇప్పటికే కందుకూరు, పొదిలి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.

Updated Date - Mar 17 , 2026 | 03:03 AM