నేడు ఎన్టీఆర్ వర్ధంతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:51 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతిని పెద్దఎత్తున చేస్తుంటారు.
భారీగా నిర్వహించనున్న తెలుగు తమ్ముళ్లు
పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానానికి ఏర్పాట్లు
ఒంగోలులో ఆధునికీకరించిన విగ్రహం ఆవిష్కరణ
హాజరుకానున్న మంత్రులు ఆనం, డోలా
ఈదర నేతృత్వంలో నేటి నుంచి నాటకోత్సవాలు
బొడ్డువానిపాలెంలో విగ్రహావిష్కరణకు మంత్రి రవికుమార్
ఒంగోలు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతిని పెద్దఎత్తున చేస్తుంటారు. ఈ ఏడాది 30వ వర్ధంతి కావడంతో పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంత టా వివిధ కార్యక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని పార్టీశ్రేణులు రూపకల్పన చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతోపాటు పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహణ, పెద్దఎత్తున అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఎప్పటిలాగా ఈసారి కూడా పెద్దఎత్తున ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గతంలో అద్దంకి బస్టాండు సెంటర్‌లో ఏర్పాటుచేసిన కాంశ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఇటీవల ఆధునికీకరించారు. ఆఽ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి పాల్గొంటున్నారు. కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొనున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్దఎత్తున కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్ కళాపరిషత్ పేరుతో జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు ఒంగోలులో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ప్రదర్శనలు ఈ ఏడాది కూడా జరగనున్నాయి. నగరంలోని పీవీఆర్ స్కూలు అవరణలో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వచ్చేనెల 3 వరకు సాగనున్నాయి. కాగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని పార్టీ శ్రేణులంతా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కోరారు.