పొగాకు రైతు పోరుబాట
ABN , Publish Date - May 19 , 2026 | 03:17 AM
పొగాకు మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు, గిట్టుబాటు ధర సాధన కోసం పోరుబాట పట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నిర్వహించిన రైతు సదస్సు తీర్మానించింది.
25న వేలం కేంద్రాల వద్ద నిరసనలు
జూన్ 1న బోర్డు ఈడీ వద్దకు రాయబారం
సమస్య పరిష్కారానికి చొరవ కోరుతూ
ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు
సంయుక్త కిసాన్ మోర్చా సదస్సులో తీర్మానం
క్రాప్‌హాలిడేపైనా రైతుల్లో చర్చ
పలు పార్టీలు, రైతు సంఘాల నేతలు హాజరు
ఒంగోలు, మే 18 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు, గిట్టుబాటు ధర సాధన కోసం పోరుబాట పట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నిర్వహించిన రైతు సదస్సు తీర్మానించింది. స్థానిక రంగాభవన్‌లో సోమవారం ఎస్‌కేఎం ఆధ్వర్యంలో పొగాకు రైతు సదస్సు జరిగింది. దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాలకు చెందిన సాగుదారులు పాల్గొన్నారు. ఎస్‌కేఎం భాగస్వామ్య వామపక్ష రైతుసంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, వి.హనుమారెడ్డి, పరిటాల కోటేశ్వరరావులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సదస్సులో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు ప్రస్తుత మార్కెట్ సంక్షోభానికి కారణాలు, రైతులను గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, పొగాకు బోర్డు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయంతిబాబు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు, బోర్డు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యంగా పోరాటం చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సదస్సు ఆమోదించింది.
నేతలను కలిసి వినతిపత్రాలు
సదస్సులో నిర్ణయం మేరకు దక్షిణాదిలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల ఎదుట రైతులను కలుపుకొని ఈనెల 25న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 1న గుంటూరులోని బోర్డు ఈడీ వద్దకు రైతులతో రాయబార కార్యక్రమం చేపట్టనున్నారు. ఈలోపు పొగాకు పండే ప్రాం తంలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతిని ధులు అందరినీ కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు. ప్రధానంగా ప్రస్తుత మార్కెట్లో వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఇచ్చి త్వరితగతిన కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వాలు, పొగాకు బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా వ్యాపారులను నియంత్రించాలని కోరారు. సంక్షోభ నివారణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి కొనుగోళ్లు చేపట్టడం ద్వారా మార్కెట్‌లో పోటీ వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. గతంలో పంట సాగుకు విరామం ఇచ్చిన తరహాలో వచ్చే సీజన్‌లో కూడా క్రాప్ హాలిడే పాటించడం మంచిదన్న అంశంపై కూడా పలువురు రైతులు సదస్సులో చర్చకు పెట్టారు. పొగాకు మార్కెట్లో ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాయడాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రప్రభుత్వం కూడా రంగంలోకి వచ్చి పొగాకు కొనుగోళ్లను చేపట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సదస్సులో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, కౌలు రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి జములయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.వీరారెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు లలితకుమారి మాట్లాడారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, చుండూరి రవిబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే సైదా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు తదితరులు సదస్సులో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. పోరాట కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు.