పొగాకు రైతుల నిరసనాగ్రహం
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:00 AM
పొగాకు మార్కెట్లో మరింత సంక్షోభం పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ దిగజారుతున్న ధరలతో తీవ్ర ఆవేదన చెందుతున్న దక్షిణాది ప్రాంత రైతులు బుధవారం నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు కేంద్రాల్లో వేలాన్ని అడ్డుకున్నారు.
పతనమైన ధరలతో మూడు చోట్ల వేలం అడ్డగింత
కందుకూరులో రాస్తారోకో
టంగుటూరులో అమ్మకాలకు రాని పొందూరు రైతులు
రేపు ఒంగోలులో ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ
ఒంగోలు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో మరింత సంక్షోభం పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ దిగజారుతున్న ధరలతో తీవ్ర ఆవేదన చెందుతున్న దక్షిణాది ప్రాంత రైతులు బుధవారం నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు కేంద్రాల్లో వేలాన్ని అడ్డుకున్నారు. కందుకూరులో రోడ్డెక్కి రాస్తారోకోకు దిగడం రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని పట్టి చూపుతోంది. పొగాకు వేలం ప్రారంభించి రెండున్నర నెలలు గడిచినా మార్కెట్ మెరుగుపడలేదు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లో ధరలు పెరగకపోగా మరింత దిగజారాయి. ఇప్పటివరకు మార్కెట్ తీరును పరిశీలిస్తే దక్షిణాదిలోని 11 కేంద్రాల పరిధిలో సుమారు 17 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరిగింది. సగటున కిలోకు రూ.220 ధర లభించింది. సాధారణంగా ఈ సమయానికి కనీసం 40 మిలియన్ కిలోలు కొనుగోలు జరిగి కిలోకు రూ.270 నుంచి రూ.280 ఉంటేనే మొత్తం వేలం పూర్తయ్యేసరికి గత ఏడా ది ధరలు లభించేది అంతంతమాత్రం. అయితే అందుకు విరుద్ధంగా మార్కెట్ సాగుతుండటమే కాక రోజురోజుకూ ధరలు దిగజారుగుతున్నాయి. వారంరోజులుగా మేలు రకం గ్రేడ్‌ల ధర ఏకంగా కిలో రూ.160నుంచి రూ.170కి పడిపోయింది. బుధవారం కూడా దక్షిణాదిలోని పలు కేంద్రాల్లో ధరలు దిగజారడంతో ఇప్పటివరకు ఆవేదన చెందుతున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. కందుకూరులోని రెండు కేంద్రాల్లో రైతులు వేలం నిలిపివేసి ఆందోళనకు దిగారు. కందుకూరు-1 కేంద్రం రైతులు ఏకంగా కనిగిరి- కందుకూరు రోడ్డుపై రాస్తారోకో చేశారు. మరోవైపు కొండపిలోనూ రైతులు వేలం నిలిపేశారు. అక్కడికి బుధవారం 1,130 బేళ్లు వేలంకు రాగా సగం నోబిడ్ అయ్యాయి. దీంతో రైతులు వేలం ఆపేశారు. ఇక టంగుటూరులో మంగళవారం పొందూరు రైతులు ఇలాగే వేలాన్ని అడ్డుకున్నారు. బుధవారం వారు అసలు అమ్మకాలకు రాకుండా ఆగిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఆ క్టస్లర్ బేళ్లు నిలిపివేసి మరో క్లస్టర్ బేళ్లను అక్కడి అఽధికారులు తెప్పించి వేలం నడిపారు. ఇదిలా ఉండగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన పొగాకు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా ఈనెల 19న ఒంగోలులో భారీగా ట్రాక్టర్లతో నిరసన ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు.