Share News

సజావుగా సాగేలా...

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:34 AM

జిల్లా రైతులకు శుభవార్త. సాగర్‌ ఆయకట్టులోని కాలువలు, ఇతర నీటి వనరులను వచ్చే వ్యవసాయ సీజన్‌కు సిద్ధం చేసేందుకు భారీగా నిధులు విడుదల కానున్నాయి.

సజావుగా సాగేలా...

సాగునీటి వనరుల మరమ్మతులకు రూ.25 కోట్లు

సాగర్‌ కాలువలకు రూ.12 కోట్లు

ఇతర వనరులకు రూ.13 కోట్లు

వారంలో మంజూరు కానున్న పనులు

వేసవిలో పూర్తికి చర్యలు

జిల్లా రైతులకు శుభవార్త. సాగర్‌ ఆయకట్టులోని కాలువలు, ఇతర నీటి వనరులను వచ్చే వ్యవసాయ సీజన్‌కు సిద్ధం చేసేందుకు భారీగా నిధులు విడుదల కానున్నాయి. వివిధ సాగునీటి వనరులకు నీరు వచ్చే, పొలాలకు వెళ్లే కాలువల మరమ్మతు పనులు త్వరలో చేపట్టేలా సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓఅండ్‌ఎం) కింద నిధుల మంజూరుకు సంకల్పించింది. అందుకు అవసరమైన పనుల ప్రతిపాదనలను జిల్లాల నుంచి ఉన్నతాధికారులు ఇప్పటికే తీసుకున్నారు. వాటిని వారంరోజుల్లో మంజూరు చేసి ఈ వేసవిలో పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఒంగోలులోని జలవనరుల శాఖ సర్కిల్‌ పరిధిలో ఇందుకోసం రూ.25కోట్లు మంజూరు కానున్నట్లు సమాచారం.

ఒంగోలు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : రానున్న పంటల సీజన్‌లోపు సాగునీటి వనరులను సిద్ధం చేయడంపై జలవనరు లశాఖ దృష్టి సారించింది. అన్ని వనరులకు నీరు వచ్చే, పొలాలకు సరఫరా చేసే మార్గాలను ఈ వేసవిలో బాగుచేయాలని నిర్ణయించింది. ఒంగోలులోని జలవనరుల శాఖ సర్కిల్‌ పరిధిలో సాగర్‌ కాలువల మరమ్మతులకు రూ.12 కోట్లు కేటాయిం చగా.. ఇతర వనరులైన చిన్న, మధ్య తరహా చెరువుల పనులకు మరో రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నిధులతో ఆయా వనరుల్లోకి నీరు సజావుగా చేరేందుకు, అలాగే వాటి నుంచి పంట పొలాలకు ఆటంకం లేకుండా వెళ్లేందుకు అవసరమైన పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా జంగిల్‌ క్లియరెన్స్‌, డ్రాపులు, షట్టర్ల మరమ్మతులు, అలుగులు ఇతర స్ట్రక్చర్ల వద్ద పనులు, అవసరమైన చోట్ల పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు, కాలువల కట్టల పటిష్టత వంటి పనులు చేపడతారు.

గతంలో అధ్వానం.. ప్రస్తుతం బాగు

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ తరహా పనులకు ఒక్క రూపాయి ఇవ్వక నీటి వనరులు, వాటికి అనుబంధంగా ఉండే కాలువలు అధ్వానంగా మారి నీటి సరఫరాలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ పనులపై దృష్టిసారించి ఏటా అత్యవసరమైన పనులను చేపడుతున్నారు. గత ఏడాది సాగునీటి సంఘాల పర్యవేక్షణలో ఓఅండ్‌ఎం కింద సుమారు రూ.17.60 కోట్లతో వివిధ వనరులలో పనులు చేశారు. ప్రస్తుతం 2026-27 సంవత్సరానికి సంబంధించి రూ.25కోట్లతో పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధుల మంజూరుకు ముందుగానే జలవనరులశాఖ ఉన్నతాధికారులు సంకేతాలను నియోజకవర్గాల వారీగా కూడా ఇచ్చారు. తదనుణంగా పనులను స్థానిక అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. వారంలో అవి మంజూరవుతాయని తెలుస్తోంది. ఆ వెంటనే చేపట్టి వేసవిలో పూర్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 01:34 AM