అభాసుపాలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:31 PM
పోలీసుల పార్టీ వ్యవహారం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీయగా అభూతకల్పనలతో దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ అభాసుపాలైంది. అటు సీఎం, ఇటు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్‌ల జోక్యంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అసలేం జరిగిందనే విషయాన్ని తేటతెల్లం చేశారు.
దెబ్బతిన్న పోలీసు ప్రతిష్ట
కనిపించని కుట్రకోణం
సీఎం, మంత్రి జోక్యంతో నిగ్గుతేల్చిన అధికారులు
ఆధారాల్లేకుండా వైసీపీ నేతలు, వారి అనుకూల మీడియా ఆరోపణల పరంపర
పోలీసుల పార్టీ వ్యవహారం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీయగా అభూతకల్పనలతో దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ అభాసుపాలైంది. అటు సీఎం, ఇటు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్‌ల జోక్యంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అసలేం జరిగిందనే విషయాన్ని తేటతెల్లం చేశారు. అంతవరకు ఓకే అనుకున్నా సంబంధిత అధికారులపై తూతూమంత్రంగా చర్యలు తీసుకోవటం ద్వారా ఉన్నతాధికారుల వైఖరి విమర్శలకు తావిచ్చింది. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఈర్ల గంగమ్మ దేవాలయం వద్ద పోలీసులు విందు పార్టీ చేసుకోవటంతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు ప్రయాణించే కారు ప్రమాదానికి గురికావటమే ఇందుకు మూలం.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ గ్రానైట్ క్వారీల సమీపంలో ఉన్న ఈర్ల గంగమ్మ దేవాలయం వద్ద గత ఆదివారం పోలీసులు విందు పార్టీ చేసుకున్నారు. అనంతరం బల్లికురవ, సంతమాగులూరు ఎస్‌ఐలు నాగరాజు, నాగమల్లేశ్వరరావులు ప్రయాణిస్తున్న ప్రైవేటు వాహనం ఆటోను ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రెడ్డిపాలెం వద్ద చోటుచేసుకుంది. అనంతరం గ్రామస్థులు ఆ కారులో కొంత గంజాయి, ఒక ఫుల్ బాటిల్ మద్యం, ఖాళీ మద్యం సీసాలను గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమై అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మంత్రి రవికుమార్‌ల జోక్యంతో ఉన్నతాధికారులు కదిలి దర్యాప్తు చేశారు.
ఇదీ జరిగింది..
పోలీసు అధికారుల దర్యాప్తుతోపాటు ఇతరత్రా సేకరించిన సమాచారం ప్రకారం గుడి వద్ద గతంలో వలే ఈ ఏడాది బల్లికురవ ఎస్‌ఐ నాగరాజు పార్టీ ఏర్పాటు చేశారు. ఇటీవల సీఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన ఆ సందర్భంగా మొక్కు తీర్చుకునే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణతోపాటు సంతమాగులూరు, అద్దంకి సీఐలు శేషగిరిరావు, సుబ్బరాజు, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బందితోపాటు నాగరాజుకు పరిచయం ఉన్న జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఆ విందుకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం మూడు, మూడున్నర వరకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంతమాగులూరు, బల్లికురవకు చెందిన ఇద్దరు ముగ్గురు టీడీపీ నాయకులు కూడా హాజరయ్యారు. గ్రానైట్ వ్యాపారులు మాత్రం ఒక్కరు కూడా హాజరు కాలేదని పూర్తిస్థాయిలో నిర్ధారణ అయింది. విందుకు వచ్చిన వారిలో కొందరు దేవాలయం వద్ద కాకుండా కారుల్లోనూ, సమీప తోటల్లోనూ మద్యం సేవించి తర్వాత భోజనాలు చేశారనేది కూడా తేలింది.
ఆ ఆరోపణల్లో నిజం లేదు
ఉన్నతాధికారుల దర్యాప్తులో కూడా పార్టీకి గ్రానైట్ వ్యాపారులు వచ్చినట్లు కానీ కారులో లిక్కర్, గంజాయిని తరలిస్తున్నట్లు కానీ నిర్ధారణ కాలేదు. ఆ ఆరోపణల్లో నిజం లేదని కూడా తేటతెల్లమైంది. ఆరంభంలో దీనిని మసిపూసి మారేడుకాయ చేయాలని అధికారులు భావించగా సీఎం జోక్యంతో మంత్రి రవి కూడా అప్రమత్తం కావటంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మొత్తం వ్యవహారంలో డ్రగ్స్ రవాణా కుట్ర లేదని తేలినప్పటికీ పోలీసులు విందు పార్టీ ఏర్పాటు చేసుకోవటం మద్యం తేవటం, కారులో కొద్దిపాటి గంజాయి ప్యాకెట్ కలిగి ఉండటం పోలీసు ప్రతిష్టను దెబ్బతీసిందని చెప్పవచ్చు. పైౖగా సీఎం జోక్యం చేసుకునే వరకు కనీసం దర్యాప్తు కూడా చేపట్టకపోవటం ఆ శాఖలోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ఇంకోవైపు ఇంత జరిగినా ఒక ఎస్‌ఐని వీఆర్‌కు పంపి మిగిలిన వారికి మెమోలతో సరిపుచ్చటం విమర్శలకు తావిచ్చింది.
అతి చేసిన వైసీపీ.. ఆపై అప్రతిష్టపాలు
ప్రతి విషయంలో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న వైసీపీ, ఆ పార్టీ తానా అంటే తందాన అనే సాక్షి మీడియా ఈ విషయంలో అభాసుపాలయ్యాయి. కొందరు పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని ప్రశ్నించకుండా మొత్తం ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం వైసీపీ చేసింది. పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోందని చూపే ప్రయత్నం చేశారు. గ్రానైట్ అక్రమ రవాణాకు అధికార పార్టీకి చెందిన పెద్దల పర్యవేక్షణలో గ్రానైట్ వ్యాపారులతో పోలీసులు అక్కడ రహస్య సమావేశం ఏర్పాటుచేశారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఈ రెండు ఆరోపణలతో సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించటం, వైసీపీ నేతలు బజారుకెక్కటం దానిని జగన్ అందిపుచ్చుకుని నేరుగా చంద్రబాబు మీదే కామెంట్లు చేసేవరకు వ్యవహారం నడిచింది. దీంతో రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి రవికుమార్ సీరియ్‌సగా తీసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేయించటంతో అసలు విషయం బట్టబయలై రాజకీయంగా వైసీపీ అభాసుపాలైంది.
సర్దిచెప్పాల్సిన అధికారే రెచ్చిపోయి..
సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావుకు చెందిన సొంత కారులో అతను, పార్టీ ఏర్పాటు చేసిన నాగరాజు అద్దంకి వెళ్తుండగా రెడ్డిపాలెం వద్ద కారు ఓ ఆటోను ఢీకొట్టింది. అందులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే 108లో వారిని వైద్యశాలకు పంపి అద్దంకి సీఐ సంఘటనా స్థలానికి వచ్చాక వారు కూడా వైద్యశాల వద్దకు వెళ్లి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. కారులో గంజాయి ప్యాకెట్, మద్యం బాటిల్, కొన్ని ఖాళీ బాటిళ్లు ఉండటాన్ని రెడ్డిపాలెం వారు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సీఐ సుబ్బరాజు ప్రజల మీద రెచ్చిపోయి బెదిరించే ప్రయత్నం చేయటంతో విషయం రచ్చకెక్కింది. మొత్తం దర్యాప్తు అనంతరం కారులో గంజాయి ప్యాకెట్, మద్యం బాటిల్ ఉండటం నిజమేనని తేలింది. పోలీసులు చెప్పినట్లు అవి మధ్యలో అనుమానితుల వద్ద పట్టుకున్నారనేది నిజం కాదని నిర్ధారించారు. వివిధ కారణాలతో కోర్టులో పెట్టకుండా పోలీసులు ఉంచుకున్న గంజాయిగా ప్రచారం జరుగుతోంది.