పట్టు సాధించాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:07 AM
మార్కాపురం జిల్లాలో శనివారం జరిగిన రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబునాయుడు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. తొలుత నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు చరిత్రాత్మకం అని చెప్పవచ్చు.
సీఎం చంద్రబాబు ద్విముఖ వ్యూహం
ఇటు అభివృద్ధి, అటు రాజకీయం
ప్రజలకు వినతి.. పార్టీ శ్రేణులు, అధికారులకు చురకలు
ప్రజా సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
గిద్దలూరు సభకు పోటెత్తిన ప్రజలు
మార్కాపురం జిల్లాలో శనివారం జరిగిన రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబునాయుడు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. తొలుత నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు చరిత్రాత్మకం అని చెప్పవచ్చు. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యపరమైన సంజీవని కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు ప్రజావేదికలో కార్యకర్తలతో ముఖాముఖి ద్వారా తన ఉద్దేశాన్ని తేటతెల్లం చేశారు. నష్టపరిహారం పంపిణీ ద్వారా 7వేల మంది లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియడమే కాక, యావత్ పశ్చిమప్రాంత ప్రజల్లో వెలిగొండ పూర్తిపై పూర్తి విశ్వాసం ఏర్పడింది. గిద్దలూరు సభకు ప్రజలు భారీగా తరలిరావడం కూడా చంద్రబాబు లక్ష్యసాధనలో ముందడుగుగా చెప్పుకోవచ్చు. అదేసమయంలో పాలనాపరమైన వ్యవహారాల్లో అధికారుల పనితీరును ఆయన వెల్లడిస్తూ వారిపై సీరియస్ అయ్యారు. ఇంకోవైపు పదవులకే పరిమితమై ప్రజల్లో తిరగని నాయకులకు చురకలు వేశారు.
(ఒంగోలు ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లాలో ద్విముఖ వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. శనివారం ఆ జిల్లాలో జరిగిన రెండు కార్యక్రమాల తీరుతెన్నులు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. అభివృద్ధి సాధన ద్వారా రాజకీయంగా పార్టీ పట్టు పెంచుకునే విధంగా ఆయన ముంద డుగు వేస్తున్న విషయం ప్రస్ఫుటమైంది. తన మాటల ద్వారా ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమప్రాంతం మొదటి నుంచి కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైసీపీకు పట్టుకొమ్మలా నిలిచింది. 2019లో వైసీపీకి భారీస్థాయి ఆధిక్యం ఆ ప్రాంతంలో లభించింది. 2024లో టీడీపీ అనూహ్యంగా అఖండ విజయం అందుకుంది. అందుకు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయకపోవడం, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జగన్‌కు శాపాలుగా మారాయని చెప్పవచ్చు. ఆ విషయాన్ని గుర్తించి ముందుగానే వాటిపై స్పష్టమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆధికారంలోకి రాగానే వాటి అమలుకు ప్రాధాన్యం ఇచ్చారు. తదనుగుణంగా ఆ విషయాన్ని రెండు సభల్లో ప్రత్యేకంగా చెప్పుకున్నారు కూడా. ఇటు జిల్లా ఏర్పాటు, అటు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో పూర్తిస్థాయి పురోగతితో రాజకీయంగా ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే విధంగా ఆయన ప్రత్యేకంగా వెల్లడించారు. ‘ఈ ప్రాంత అభివృద్ధికి అన్నీ చేసేది టీడీపీనే. కానీ ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపిస్తే మరోసారి ఓడించారు’ అంటూ రాజకీయ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే గత ఎన్నికల్లో దర్శి, వైపాలెంలో టీడీపీకి ఎదురైన ఓటమి విషయాన్ని ప్రస్తావించారు. మీరడిగిన జిల్లానిచ్చా, ప్రాజెక్ట్ పూర్తిచేస్తున్నా, హార్టికల్చర్ హబ్‌ను మీ ప్రాంతంలో చేర్చా. ఇప్పటికైనా మంచి మనుసుతో ఆలోచించండి, కుల, ప్రాంతీయ అభిమానాలను పక్కనబెట్టాలని బహిరంగంగానే సూచించారు. వెలిగొండ నిర్వాసితుల్లో ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రి వారిస్తున్నా పాదాభివందనం చేసి కృతజ్ఞత చూపించారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒక యువరైతు భావోద్వేగం చెంది కన్నీరు పెట్టుకుని, ముప్పై ఏళ్లనాటి కల ఫలించిందని, ఈ నష్టపరిహారంతో తమ బిడ్డల భవిష్యత్తుకు దోహదపడుతుందని వివరించారు.
గిద్దలూరు సభకు భారీగా తరలిన ప్రజలు
గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన, సంజీవని కార్యక్రమం ప్రారంభం అనంతరం ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. సాధారణంగా ప్రస్తుతం చంద్రబాబు కార్యక్రమానికి భారీగా ప్రజల్ని తరలించే పద్ధతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. మూడు, నాలుగు వేలమందితో ఇండోర్ సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడా అలానే నిర్వహించాలని భావించినప్పటికి నియోజవకర్గంలోని టీడీపీ, ఇతర కూటమి పార్టీశ్రేణులు, సాధారణ ప్రజానీకం తరలిరావడంతో భారీ బహిరంగ సభగా మారింది. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మండలాల వారీ అందులో ముఖ్యగ్రామాల వారీ సమావేశాలు నిర్వహించి సీఎం సభను ఎందుకు జయప్రదం చేయాలో వివరించడం కూడా ప్రజలను కదిలించింది. 15వేల నుండి 20వేల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.
సానుకూల స్పందన
గిద్దలూరు పట్టణం నుంచి అత్యఽధిక సంఖ్యలో ప్రజలు హాజరైనట్లు కనిపించింది. అర్ధవీడు మండలం నుంచి కూడా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడం విశేషం. ఆ సభలో కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరించడంతోపాటు మీకోసం మీ కోరికలన్నీ తీరుస్తున్నా, మరి మీరెందుకు మాకు అండగా ఉండరంటూ సూటిగా ప్రశ్నించారు. చేసిన, చేయబోతున్న పనులను వివరించి మంచి ఆలోచనతో మద్దతుగా నిలవాలంటూ ప్రజానీకానికి సూచనలు చేశారు. ఆ సందర్భంగా సభ నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడం విశేషం.
యంత్రాంగానికి చురకలు
ఆయా ప్రజా సంక్షేమ పథకాల అమలు, ఇతర ప్రభుత్వ పనుల్లో అధికారుల పని తీరుకు సంబంఽధించి కొన్ని అంశాలను సీఎం వివరిస్తూ.. అధికార యంత్రాంగానికి సూటిగానే చురకలు వేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆయా జిల్లాల్లో యంత్రాంగం పని తీరును పసిగడితే మార్కాపురం జిల్లా 26వ స్థానంలో ఉందని ప్రకటించారు. కొత్త జిల్లా అయినప్పటికీ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయకుంటే ఇలానే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. 52 ప్రభుత్వ సర్వీసుల్లో 45 సేవలకు సంబంధించి బిలో యావరేజ్‌లో యంత్రాంగం పనితీరు ఉందన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణ కూడా సంతృప్తికరంగా లేదన్నారు. పట్టణ ప్రాంతంలో మంచినీటి సరఫరా విషయంలో పలు అంశాలను వివరిస్తూ వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. రవాణా యంత్రాంగం మరీ అధ్వానంగా ఉందంటూ సంబంధిత అధికారిని పిలిచి మరీ హెచ్చరికలు జారీచేశారు. అంగన్‌వాడీ విభాగానికి చెందిన మహిళా అధికారిణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మెరుగుపడాలంటూ వేదిక మీద ఉన్న స్వామిని మీరైనా చొరవ తీసుకోవాలని సూచించారు. అన్నింటికీ మించి వారంవారం యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాల్లో వచ్చే వినతులకు సరైన పరిష్కారం చూపలేకపోతున్నదని ఈ విషయంలో కలెక్టర్, అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు. గిద్దలూరులో జరిగిన పార్టీశ్రేణుల సమావేశంలో కిందిస్థాయి నాయకులపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఏ విషయాల్లో పద్ధతి మార్చుకోవాలో నేను చెబుతా.. కానీ కిందిస్థాయి నాయకులు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడి ఉండటం సహించనని చెప్పారు.