కేజీబీవీల్లో బదిలీలకు వేళాయె!
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:16 AM
ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రిన్సి పాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీలకు సంబంధించి తుది సీనియారిటీ జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఒకేస్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రిన్సిపాళ్లు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది
మొత్తం 235 మంది దరఖాస్తు
పరిశీలన పూర్తి చేసిన కమిటీ
సిద్ధమవుతున్న తుది జాబితాలు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రిన్సి పాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీల బదిలీలకు సంబంధించి తుది సీనియారిటీ జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఒకేస్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రిన్సిపాళ్లు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. బదిలీ కోసం 235 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 199మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఉన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 71మంది అవివాహితులు, వివాహితులు (స్పౌజ్) స్పెషల్ పాయింట్లు కోరుకున్నారు. బదిలీల్లో ప్రాధాన్యత కోసం దరఖాస్తు చేసిన 37 మంది వైద్యపత్రాలను పరిశీలనకు జిల్లా మెడికల్ బోర్డుకు పంపారు. వాటిని పరిశీలించడంతోపాటు అవసరమైన వారిని పిలిపించుకొని పరీక్షించి తమ నివేదికను మెడికల్ బోర్డు సమర్పించింది. ఆయా పత్రాలను ముగ్గురు ఎంఈవోల కమిటీ పరిశీలించి బదిలీల్లో ప్రాధాన్యతకు ఎంతమందికి అర్హత ఉందో గుర్తించింది. మొత్తం 37 మందిలో ఐదుగురు అనర్హులని తేల్చింది. వీటి ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాలో మార్పులు, చేర్పులు చేసి మళ్లీ జాబితాలను రూపొందించారు. వాటిపై అభ్యంతరాలకు గడువు బుధవారంతో ముగిసింది. తుది జాబితాను తయారు చేసి కౌన్సెలింగ్ తేదీ ప్రకటించాల్సి ఉంది.