శరవేగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:21 AM
పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగు తున్నాయి. అద్దంకి పట్టణానికి సమీపంలోని కొండ వద్ద 960 కుటుంబాలకు టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి.
జూన్ నాటికి పనుల పూర్తికి కసరత్తు
మౌలిక వసతుల కల్పనకు అదనంగా నిధులు మంజూరు
అద్దంకి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగు తున్నాయి. అద్దంకి పట్టణానికి సమీపంలోని కొండ వద్ద 960 కుటుంబాలకు టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభమై చాలా వరకు పూర్తయ్యాయి. 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసింది. పనులు పూర్తిచేయకుండా నిలిపివేసింది. 2024 ఎన్నికలలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తి పనుల పూర్తికి చర్యలు చేపట్టింది. అద్దంకి సమీపంలో 960 ప్లాట్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం అంచనా వ్యయం రూ.67 కోట్లు కాగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూ.44 కోట్ల వరకూ వెచ్చించారు. మిగిలిన రూ.23 కోట్లకు సంబం ధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ టిడ్కో అధికారులతో సమావేశమై పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. వీటికి అదనంగా రోడ్లు, సైడ్ డ్రైయిన్‌లతోపాటు అద్దంకి పట్టణం నుంచి టిడ్కో ఇళ్ల వరకు సుమారు 4.8 కి.మీ. దూరం పైప్‌లైన్, అంతర్గత పైప్‌లైన్‌లు తదితర మౌలిక వసతులకు సంబంధించి రూ.13 కోట్లతో ఇటీవల టెండర్‌లు పూర్తయ్యాయి. మురుగునీరు శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. రూ.4.5 కోట్లతో చేపట్టిన 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు జూన్‌కు పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన చిన్నచిన్న మౌలిక వసతులకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా పూర్తిచేయాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి రవికుమార్ ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల సొంతింటి కల త్వరలో నెరవేరనుంది.