టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:41 PM
టిడ్కో గృహ సముదాయాన్ని నాణ్యతా ప్రమాణాలతోపాటు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
అన్ని మౌలిక వసతుల కల్పించి లబ్ధిదారులకు అందజేత
మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి) : టిడ్కో గృహ సముదాయాన్ని నాణ్యతా ప్రమాణాలతోపాటు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శింగరకొండ సమీపంలో నిర్మాణ పనులు పునఃప్రారంభమైన టిడ్కో గృహసముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని సుమారు 960 మంది లబ్ధిదారులకు గత టీడీపీ ప్రభుత్వంలో శింగరకొండ సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి 75 నుంచి 80 శాతం పూర్తి చేసినట్టు చెప్పారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణీతో వ్యవహరించి అర్ధంతరంగా నిలిపివేసిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి నిర్మాణ పనులు పునఃప్రారంభించినట్టు చెప్పారు. టిడ్కో ఇళ్ళ వద్ద రూ.15 కోట్లతో మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. జూన్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టిడ్కో గృహ సముదాయాల నిర్మాణ పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయన్నారు. అద్దంకిలో పనులు ప్రారంభించటం ఆలస్యమైనందున మరో రెండు నెలల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.