పిడుగుల వాన
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:19 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పలుచోట్ల ఉరుములు, పిడుగులు, వడగండ్లతో కూడిన వాన పడింది. అప్పటివరకు ఉక్కపోతతో వేడిగాలుల తాకిడి చూసిన ప్రజలు ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం కురిసి ఉపశమనం కలుగుతుందని భావించారు.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఆరుగురు దుర్మరణం
పుల్లలచెరువులో ముగ్గురు
కనిగిరి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో ఒక్కొక్కరు మృతి
మరో నలుగురికి గాయాలు
పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, విరిగిన చెట్లు
మర్రిపూడిలో వడగళ్లు
పుల్లలచెరువు/కనిగిరి/ముండ్లమూరు/దర్శి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పలుచోట్ల ఉరుములు, పిడుగులు, వడగండ్లతో కూడిన వాన పడింది. అప్పటివరకు ఉక్కపోతతో వేడిగాలుల తాకిడి చూసిన ప్రజలు ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం కురిసి ఉపశమనం కలుగుతుందని భావించారు. కానీ కొన్నిచోట్ల పిడుగులు పడి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. పిడుగు పాటుకు పుల్లలచెరువు మండలంలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. కనిగిరి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. మర్రిపూడి మండలంలో వడగళ్ల వాన కురిసింది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో పిడుగులు పడి వేర్వేరు చోట్ల ముగ్గురు మృత్యువాత పడ్డారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఒకరు, కూలికి వెళ్లిన మరొకరు, వ్యవసాయ ఎడ్లు కొనేందుకు వచ్చిన ఇంకొకరు ఇంటికి తిరిగి వెళ్లకుండానే కన్నుమూశారు. పుల్లలచెరువు సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేసేందుకు బిహార్ రాష్ట్రం నుంచి వచ్చిన 18 ఏళ్ల కన్నయ్య మృతి వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో నలుగురు గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇదే మండలంలోని కొమరోలు సమీపంలో కూలి పనులకు వెళ్లి వస్తున్న ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెకు చెందిన బొందలపాటి నాగయ్య(60) పిగుగుపాటుకు మృతి చెందారు. ఆయనకు 8 మంది పిల్లలు ఉన్నారు. కూలి పనులే జీవనాధారం. కుటుంబ పెద్ద మృతి చెందడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మడతల
శ్రీనివాసరెడ్డి (42) ఎడ్లు కొనేందుకు చాపలమడుగు రెవెన్యూ పరిధిలోని కొత్తూరు శివారుకు వచ్చారు. వర్షం వస్తుండటంతో చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి భార్య పిల్లులు ఉన్నారు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద బిహార్‌కు చెందిన రైల్వే కూలీ దుర్గేష్ కుమార్ (25) పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. కనిగిరి - కందుకూరు రోడ్డుపై వర్షం, గాలులు కారణంగా చెట్టు పడిపోయింది. అధికారులు చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఏరువారిపల్లి గ్రామంలో అంకాలమ్మ దేవాలయం వద్ద చెట్లు నేలకొరిగాయి.
వేములబండ వద్ద గొర్రెలకాపరి..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములబండ వద్ద పొలాల్లో పిడుగుపడి గొర్రెల కాపరి రావులపల్లి శివకృష్ణ (22) మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. శివకృష్ణ తన బంధువులు అయిన రావులపల్లి శ్రీను, మల్లయ్య మరికొంతమందితో కలిసి వేములబండ వద్ద పొలాలను కౌలుకు తీసుకొని మేత మేపుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. గొర్రెలు మేపుకుంటుండగా శివకృష్ణ ఉన్న ప్రదేశంలోనే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో ఆయన సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా అది పేలిపోయింది. ఆయన చెవి నుంచి రక్తం కూడా వచ్చింది. తోటి పశువుల కాపరులు శివకృష్ణ దగ్గరకు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే పసుపుగల్లులోని కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొని రావడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని టీడీపీ నియోజకవర్గ నేత డాక్టర్‌లలిత్ సాగర్, తహసీల్దార్ ఆర్.శ్రీకాంత్, ఆర్‌ఐ మూర్తి, ఏఎస్‌ఐ పవన్ కుమార్‌లు సందర్శించారు.
సామంతపూడిలో ఒకరు..
దర్శి మండలం సామంతపూడిలో పిడుగుపడి ఆవుల మల్లికార్జున (24) మృతి చెందారు. ఆయన సోమవారం సాయంత్రం పొలం వెళ్లాడు. గడ్డి కోసుకొని తిరిగి వస్తున్న సమయానికి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం ఆరంభమైంది. అదేసమయంలో ఉరుములతోపాటు పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మల్లికార్జునకు భార్య, రెండేళ్ల పాప ఉంది. భార్య అశ్వని ప్రస్తుతం గర్భిణి కావడం అత్యంత విషాదకరం. భర్తను కోల్పోయిన ఆమె గుండెలవిసేలా రోధించడం అందరినీ కంటతడి పెట్టించింది.