మూడు వారాలు.. రూ.110కోట్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:07 AM
జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో చేపట్టిన పనుల పూర్తికి యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. ఇటీవల రూ.110 కోట్లతో ఈ పనులు మంజూరు చేశారు. వాటిని వచ్చేనెల 15లోపు పూర్తిచేసి ఎం.బుక్ కూడా నమోదు చేయాల్సి ఉంది.
ఉపాధి మెటీరియల్ పనుల పూర్తికి ఉరుకులు, పరుగులు
కేంద్రం మెలికతో ఆలస్యంగా అభివృద్ధి పనులు మంజూరు
సకాలంలో పూర్తిచేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం
కొన్ని నియోజకవర్గాల్లో కీలక ప్రజాప్రతినిఽధులు కూడా పర్యవేక్షణ
జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో చేపట్టిన పనుల పూర్తికి యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. ఇటీవల రూ.110 కోట్లతో ఈ పనులు మంజూరు చేశారు. వాటిని వచ్చేనెల 15లోపు పూర్తిచేసి ఎం.బుక్ కూడా నమోదు చేయాల్సి ఉంది. ఆ లోపు పనులు పూర్తిచేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో డ్వామా సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నేతలు పరుగులు పెడుతున్నారు. ఈ పనులను నాలుగైదు నెలల క్రితమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ని‘బంధనాలు’, ఉపాధిలో మార్పు, నిధుల లభ్యతపై అస్పష్టత వంటి కారణాలతో జాప్యం చోటుచేసుకుంది.
ఒంగోలు ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి మెటీరియల్ కోటా నిఽధుల వినియోగం కోసం యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. పథకం నిబంధనల ప్రకారం కూలీలకు పనులు కల్పించడం ద్వారా జిల్లాలో వేతన రూపంలో ఎంత నిధులు ఖర్చవుతాయో అందులో రెండొంతుల మేర అదనంగా మెటీరియల్ కోటా కింద మంజూరవుతాయి. వాటితో గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైపులైన్లు, భవనాల నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. డ్వామా శాఖ పరంగా చేపట్టే పండ్లతోటల అభివృద్ధి, మొక్కల పెంపకం, జలసంరక్షణలో భాగంగా పంట కుంటలు, ఇంకుడుగుంతల తవ్వకాలు, మినీగోకులాల నిర్మాణం వంటి వాటికి ఆ నిధులు ఖర్చు చేయొచ్చు. జిల్లాలో ప్రస్తుత ఏడాది రూ.280కోట్ల మేర కూలీల పనుల కల్పన ద్వారా వేతన రూపంలో రాగా నిబంధనల ప్రకారం రూ.183కోట్ల వరకు మెటీరియల్ కోటా కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. గత సెప్టెంబరు నాటికే ఆ మేరకు స్పష్టమైన అంచనా ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన అనేక పనులను చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది వేసవిలో పూర్తి చేసి ఎం.బుక్‌లు నమోదు చేసి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యే రావడంతో రాష్ట్రప్రభుత్వం స్పందించింది. కేంద్రం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో పదికి బదులు 20 పనుల వరకు పెంచింది. ఆ ప్రతిపాదికన ఉమ్మడి జిల్లాలో ఏయే గ్రామాల్లో పనులకు అవకాశం ఉందో గుర్తించి ప్రజాప్రతినిధులతో చర్చించి చివరకు ఈనెలలో అధికారులు పనులు మంజూరు చేయడం ప్రారంభించారు. అలా ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రూ.12కోట్ల నుంచి రూ.17కోట్ల వరకు కేటాయించారు. అలా రూ.110 కోట్ల విలువైన పనులు మంజూరుచేశారు. ఉమ్మడి జిల్లాలో 729 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 196 గ్రామాల్లో 368 పనులను ఇలా మంజూరు చేశారు. ఒక్కో పనికి కనిష్ఠంగా రూ.10లక్షలు, గరిష్ఠంగా రూ.50లక్షలు కేటాయించగా అధికశాతం పనులు సీసీరోడ్లు, తారురోడ్లు, మెటల్‌రోడ్లతోపాటు కొన్నిచోట్ల డ్రైన్లు నిర్మాణాలు ఉన్నాయి.
అందుబాటులో ఉన్న నిధుల వినియోగం
ఈ ఏడాది అందుబాటులో ఉన్న రూ.183 కోట్ల ఉపాధి మెటీరియల్ కోటా నిధులలో గతేడాది మంజూరు చేసి ఈ ఏడాది పూర్తిచేసిన అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు పెండింగ్ ఉన్న బిల్లులు కలిపి సుమారు రూ.65 కోట్లు ఉన్నాయి. వాటిని కూడా ఈ ఏడాది నిధులతో సర్దుబాటు చేశారు. అవి పోను సుమారు రూ.118 కోట్లు ఈ ఏడాది పనులకు అందుబాటులో ఉన్నాయి. మరో రూ.25కోట్ల వరకు డ్వామా శాఖ పరంగా చేసే పనులకు ఖర్చు కాగా ప్రస్తుతం సుమారు రూ.90 కోట్లు అటుఇటుగా నిధులు అందుబాటులో ఉన్నాయి. దీంతో మొత్తం రూ.110కోట్ల పనులు మంజూరు చేశారు. గతంలో మంజూరు చేసిన పనులలో 20శాతం పలు కారణాలతో ఆగిపోవడం లేదా అసంపూర్తిగా ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్న నిధుల మొత్తాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అదనంగా రూ.20 కోట్లకుపైగా పనులు మంజూరుచేసినట్లు సమాచారం.
కేంద్రం మెలికతో ఆటంకం
గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి పెద్దమొత్తంలో నిధులను వైసీపీ వచ్చాక బిల్లులు చెల్లించకుండా ఆపేసింది. అలా ఆపిన వాటిలో కోట్లాది రూపాయల పనులకు సంబంధించిన నమోదు కూడా సరిగా జరగలేదు. దీంతో ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే నిధులతోపాటు పాత బిల్లులను తొలుత చెల్లించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త పనులు మంజూరును పట్టించుకోలేదు. అయితే పాత పనుల బిల్లుల చెల్లింపునకు సాఫ్ట్‌వేర్‌లో నమోదుకు కేంద్రం అనుమతి అవసరం కావడంతో ఆ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమైంది. ఈనేపథ్యంలో కొత్త పనుల మంజూరు కూడా మరింత ఆలస్యమైంది. డిసెంబరు ఆఖరు నాటికి పాత పనుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. తీరా జనవరి తొలివారంలో కొత్తవి మంజూరు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఒక గ్రామంలో జరుగుతున్న పనులు పదికి మించితే అలాంటి చోట కొత్తవి చేపట్టే అవకాశం లేదన్న మెలిక కేంద్రం పెట్టడంతో అత్యధిక గ్రామాల్లో మంజూరు చేసిన పనులకు ఆటంకం ఏర్పడింది.
సామగ్రి కోసం ప్రత్యేక చర్యలు
ఈపనులు పూర్తిచేసి ఎం.బుక్‌ను కూడా చేసి మార్చి 15లోపు సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అందుకు ఇక మూడు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో డ్వామా, పీఆర్ అధికారులు పనుల పూర్తికి ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అధికశాతం రోడ్ల పనులు కావడంతో ఇసుక, కంకరు వంటి సామగ్రి తాజా ప్రభుత్వ విధానాలతో గనుల శాఖ అనుమతి, ప్రైవేటు సంస్థల బిల్లులు ఇవ్వడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సకాలంలో వాటి చర్యల కోసం ప్రత్యేకంగా అటు గనులశాఖ, ఇటు పీఆర్ స్థానిక కార్యాలయాల్లోనూ డ్వామా సిబ్బందిని కేటాయించారు. మరోవైపు పనుల గుర్తింపు, చేసేవారి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన ఆయా నియోజకవర్గాల నేతలు కూడా ఈ పనులు పూర్తిపై దృష్టిసారించారు. ఏమైనా మూడు వారాల్లో ఇంత పెద్దస్థాయిలో పనులు పూర్తిచేయాల్సి రావడంతో అందరూ హడావుడి పడుతున్నారు.