ముగ్గురు సీనియర్లు.. నలుగురు జూనియర్లు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:05 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్న పురపాలక సంఘాల సారథుల్లో రాజకీయంగా ముగ్గురికి అనుభవం ఉండగా, నలుగురు కొత్తవారు.
పాలనా అనుభవంలో మల్లికార్జునే ఫస్ట్
రాజకీయాల్లో దామా, కాకాని కూడా సీనియర్లు
జూనియర్లకు అన్నీ సవాళ్లే
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్న పురపాలక సంఘాల సారథుల్లో రాజకీయంగా ముగ్గురికి అనుభవం ఉండగా, నలుగురు కొత్తవారు. పాలనా అనుభవం విషయానికి వస్తే మార్కాపురం మునిసిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్ ఒక్కరికే ఉంది. దీంతో కొత్త పురపాలకులు కోటి సవాళ్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ అనుభవాన్ని చూస్తే మార్కాపురం, దర్శి, అద్దంకి చైర్మన్‌లు వక్కలగడ్డ మల్లికార్జున్, దామా సుబ్బారావు, కాకాని అశోక్‌లకు మాత్రమే ఉంది. మిగిలిన వారందరికీ తొలి అనుభవమే కాబోతోంది. 2014లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మహిళకు రిజర్వు అయిన మార్కాపురం మునిసిపాలిటీ నుంచి మల్లికార్జున్ సతీమణి చైర్మన్ అయ్యారు. ఆతర్వాత ఐదేళ్ల పాలనంతా పరోక్షంగా మల్లికార్జునే చూశారు. అంతేకాక ఆయన రాజకీయ ప్రవేశం నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తూ నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో చైర్మన్ కావడంతో మల్లికార్జున్ సాధించేఅభివృద్ధిపై ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆయన మంచి స్నేహితులు కావడంతో పరిస్పర సహకారానికి కూడా ఇబ్బంది ఉండదు.
దర్శి, అద్దంకి చైర్మన్‌లకు రాజకీయ అనుభవం
దర్శి, అద్దంకి చైర్మన్‌లు దామా సుబ్బారావు, కాకాని అశోక్‌లు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు. వారిద్దరూ తండ్రుల కాలం నుంచి రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో కీలకంగా ఉన్నారు. అద్దంకి చైర్మన్ అశోక్‌కు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ తొలిసారే ఎన్నికల బరిలో నిలిచి చైర్మన్ అయ్యారు. చీరాల చైర్మన్ హనీస్పందన టీడీపీలో కార్యకర్తగా ఉన్నా రాజకీయ అనుభవం లేదనే చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఆమె అన్నను బలితీసుకున్న నేపథ్యం లోకేష్ హనీస్పందనను ఏరికోరి టికెట్ ఇప్పించారు. బీజేపీ తరఫున గెలుపొందిన గిద్దలూరు చైర్మన్ డాక్టర్ నారాయణరెడ్డికి పాలనా అనుభవం శూన్యమే. ఒంగోలు మేయర్ శ్రీశిల్ప, చీమకుర్తి, కనిగిరి చైర్మన్‌లు సుధాకర్, తిరుపతమ్మ కూడా రాజకీయాలకు కొత్త వారే. పార్టీ టికెట్ లభించిన తర్వాతే వారు తెరపైకి వచ్చారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
అన్నీ సవాళ్లే
ఒంగోలు నగరంతోపాటు మిగిలిన మునిసిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. వాటికి మించి మునిసిపల్ కార్యాలయాల్లో అవినీతి తారస్థాయిలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. పైసా నిధులు రావాలన్నా, పాలన సజావుగా సాగాలన్నా స్ధానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో నడవాల్సిందే. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే జైకొట్టే పరిస్థితులు ఎమ్మెల్యేల నుంచి ఉండవు. ప్రస్తుతం బాధ్యతలు చేపడుతున్న వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి తరఫున పెత్తనం చేసే కుటుంబ సభ్యుల జోక్యం పెరిగినా ప్రమాదమే. మరి ఈ పరిస్ధితులను కొత్త మున్సిపల్ చైర్మన్‌లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.