రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:57 AM
కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంతమాగులూరు మండల పరిధిలోని వెల్లలచెరువు- కామేపల్లి గ్రామాల మధ్య వీరహనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏడుగురికి తీవ్ర గాయాలు
కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
సంతమాగులూరు(అద్దంకి), జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంతమాగులూరు మండల పరిధిలోని వెల్లలచెరువు- కామేపల్లి గ్రామాల మధ్య వీరహనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఆటోలో ఫిరంగిపురం మండలం సంకురాత్రిపాడు గ్రామంలో బంధువు దశదినకర్మకు వెళ్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలోకి వచ్చేసరికి లోపలి నుంచి రోడ్డు ఎక్కి మలుపు తిరుగుతున్న టర్బో లారీని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దావులూరి ఏడుకొండలు (55), ముండ్రు రమణమ్మ (55) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఎలవర్తి సుబ్బాయమ్మ(70)ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించింది. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు, పోలీసులు వెంటనే నరసరావుపేట ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో గుత్తా సుబ్బాయమ్మ, ముండ్రు వెంకటరామయ్య, ముండ్రు సుబ్బాయమ్మ, బొయపాటి లక్ష్మీదేవి, బొయపాటి అనురాధ, ఆటోడ్రైవర్ కుంకులగుంట మీరావలి ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో మహిళ డోమా చిన్నయోగమ్మకు స్వల్పగాయాలు కావడంతో ఇంటికి వెళ్లినట్ట్లు సమాచారం. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య ేసవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సంతమాగులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.