ప్రతి పది మందిలో ముగ్గురికి బీపీ, షుగర్
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:39 AM
ప్రజల ఆరోగ్య ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వైద్యారోగ్యశాఖ ఎన్‌సీడీ-4.0 (నాన్ కమ్యూనబుల్ డీసీజెస్)పై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జిల్లాలో 14,94,320మందిని సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 13,34,756 మందిని చేశారు.
పడిపోతున్న ఆరోగ్య ప్రమాణాలు
మారిన జీవన విధానమే కారణం
ఎన్‌సీడీ-4.0 సర్వేలో బహిర్గతం
జిల్లాలో 10.15లక్షల మందికి స్ర్కీనింగ్ పరీక్షలు
అందులో 2.48 లక్షల మందికి బీపీ,
2.26 లక్షల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్య ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వైద్యారోగ్యశాఖ ఎన్‌సీడీ-4.0 (నాన్ కమ్యూనబుల్ డీసీజెస్)పై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జిల్లాలో 14,94,320మందిని సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 13,34,756 మందిని చేశారు. అందులో 10,15,749 మందికి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 2,48,506 (16.69శాతం) మందికి బీపీ, 2,26,256 (15.19శాతం) మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. 2025 సెప్టెంబరు 17న ప్రారంభమైన సర్వేను ఈ ఏడాది ఆగస్టు 31 వరకు నిర్వహించారు. నోరు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి కూడా సర్వే చేశారు. ఎన్‌సీడీ సర్వే నివేదికలను గతనెల 31వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. అందులో జిల్లాలో బీపీ (రక్తపోటు) మధుమేహం (షుగర్) బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రతి పది మందిలో ముగ్గురుకి బీపీ లేదా షుగర్ ఉన్నట్లు వెల్లడైంది. అందుకు ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి కారణాలైనట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగా ప్రస్తుతం గుర్తించిన వారందరికీ అవసరమైన వైద్యసేవలు అందించే విధంగా వైద్యశాఖను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
నిరంతరాయంగా పరీక్షలు
ప్రస్తుతం గుర్తించిన బీపీ, షుగర్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక నుంచి నిరంతరాయంగా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు అధికంగా వాడకుండా జీవన విధానంలో మార్పులపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఈ సర్వే నివేదికలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా క్రోడికరించి పంపుతున్నట్లు తెలుస్తోంది.
ఆహార అలవాట్లలో మార్పులు తెచ్చేలా చర్యలు
డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
ప్రస్తుతం ఎన్‌సీడీ సర్వే నివేదిక ఆధారంగా ప్రజల జీవన విధానంలో మార్పులు తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. అందుకోసం పీహెచ్‌సీల పరిధిలో యోగాతోపాటు వాకర్స్ క్లబ్‌లు ఏర్పాటుచేసి విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నతాధికారుల నుంచి పలు ఆదేశాలు వచ్చాయి. ఇక నుంచి నిరంతరం ప్రజలకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాం.